logo

వ్యర్థం.. అగ్నికి ఆజ్యం

ఏటా వేసవిలో నగరంలో అగ్నిప్రమాదాలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ జరిగేవి కొన్నయితే, నిర్లక్ష్యంతో చోటుచేసుకునేవి కొన్ని.

Published : 27 Mar 2023 03:55 IST

డంపింగ్‌యార్డుల్లో పేరుకుపోతున్న చెత్త
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ముడసర్లోవ కేంద్రంలో వ్యర్థాల నుంచి విడుదలవుతున్న మీథేన్‌ వాయువు

ఏటా వేసవిలో నగరంలో అగ్నిప్రమాదాలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ జరిగేవి కొన్నయితే, నిర్లక్ష్యంతో చోటుచేసుకునేవి కొన్ని. ముఖ్యంగా చెత్తను నిల్వ చేసే డంపింగ్‌ యార్డుల్లో అగ్నికీలలు రేగుతున్నాయి. దీనికి నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నా..మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

* విశాఖ నగర శివారు కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో ఇప్పటికే రెండు లక్షల టన్నుల చెత్త పోగుపడి ఉంటుందని అంచనా. ఇందులో ఉన్న ప్లాస్లిక్‌ వ్యర్థాల నుంచి మీథేన్‌ వాయువు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. దీనికి అధిక ఉష్టోగ్రతలు తోడైతే అగ్నిప్రమాదాలకు ఆస్కారముంటుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం డంపింగ్‌యార్డు నుంచి వచ్చే దుర్వాసన, విషవాయువులతో మారికవలస దరి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లి పోతున్నారు.

కంటి తుడుపు చర్యలు

కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో వ్యర్థాల నిర్వహణకు రూ.8 కోట్లతో సైంటిఫిక్‌ ల్యాండ్‌ ఫిల్లింగ్‌ ప్రాజెక్టు చేపట్టారు. దాదాపు 120 ఎకరాలకుపైగా ఉన్న ఈ యార్డులో కేవలం నాలుగు ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తడి చెత్త నుంచి వర్మీకంపోస్టు తయారు చేసే పరిశ్రమ, గ్యాస్‌ ఉత్పత్తి కర్మాగారం, భవన నిర్మాణ వ్యర్థాల నుంచి టైల్స్‌, ఇతర నిర్మాణ సామగ్రి తయారు చేసే పరిశ్రమలు ఇక్కడున్నాయి. అయితే అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఫలితంగా వ్యర్థాలు ఎప్పటికప్పుడు పేరుకుపోతూ కొండలా మారుతోంది.

ఏటా రూ.12.6 కోట్ల వ్యయం

* నగరంలో 578 క్లాప్‌ వాహనాలతో ఇళ్ల నుంచి చెత్తను సేకరించి, దాన్ని వార్డుల్లో ఉన్న నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ్నుంచి తిరిగి కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తీసుకెళుతున్నారు. నెలకు ఒక్కో క్లాప్‌ వాహనానికి రూ.65వేల చొప్పున నెలకు రూ.3.75 కోట్లు ఏడాదికి రూ.45.08 కోట్లు చెల్లిస్తున్నారు. ఒక్కో నిల్వ కేంద్రం నుంచి కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు చెత్తను తరలించడానికి రూ.1.80 కోట్ల వ్యయం చేస్తున్నారు. ఏడు నిల్వ కేంద్రాల కోసం రూ.12.6 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

నిబంధనల మేరకు క్లాప్‌ వాహనాలు తెచ్చే చెత్తను నిల్వ కేంద్రాల నుంచి తరలించి స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. కాని అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కవుతూ వందల టన్నుల చెత్త నిల్వ అయ్యేంత వరకు వేచి ఉంటున్నారు. దాన్ని తరలించడానికి మరోసారి టెండర్లు పిలిచి అదనపు నిధులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఇటీవల గాజువాక, తాటిచెట్లపాలెం చెత్త నిల్వ కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు జరిగి పారిశుద్ధ్య వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

చెత్తలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేసి విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించడం, నిల్వ కేంద్రాల్లో టన్ను చెత్త కూడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా అగ్నిప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


నగరంలో చెత్త నిల్వ కేంద్రాలు

* ముడసర్లోవ

* పాతనగరం

* తాటిచెట్లపాలెం

* చీమలాపల్లి

* గాజువాక

* అనకాపల్లి

* భీమిలి

* నగరంలో రోజుకు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు: 1100 మెట్రిక్‌ టన్నులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని