logo

రైవాడను కాపాడుకుంటాం

ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరందిస్తూ సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన రైవాడ జలాశయం జీవం కోల్పోయే విపత్కర నిర్ణయాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకుందని మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు.

Published : 27 Mar 2023 03:55 IST

ప్రసంగిస్తున్న గవిరెడ్డి రామానాయుడు... ‘ఈనాడు’ కథన ప్రతులను ప్రదర్శిస్తున్న తెదేపా నాయకులు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరందిస్తూ సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన రైవాడ జలాశయం జీవం కోల్పోయే విపత్కర నిర్ణయాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకుందని మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలన్నారు. విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అదాని గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండు చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తెదేపా ఆధ్వర్యంలో అన్నదాతలంతా ఉద్యమించడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. రైవాడ జలాశయాన్ని తెదేపా నాయకులు, రైతులతో కలిసి ఆయన ఆదివారం సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23న ‘నీళ్లు లేవంటూనే-పెద్దలకు ధారపోస్తున్నారు’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రైవాడ జలాశయానికి జీవనాడులైన కొండ వాగులపై అల్లూరి జిల్లా పెదకోట సమీపంలో హైడ్రో విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించడానికి గత ఏడాది డిసెంబరులో శంకుస్థాపన జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టును అక్కడ నిర్మిస్తే సాగునీరు సరిగా అందక రైవాడ ఆయకట్టు 15,344 ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. విశాఖ వాసుల మంచినీటి సరఫరాకు విఘాతం కలుగుతుందన్నారు. రైవాడ నీరు-రైతుల హక్కు అనే నినాదానికి చంద్రబాబు ప్రభుత్వం మినహా మిగతా ప్రభుత్వాలన్నీ తూట్లు పొడిచాయని ఆరోపించారు. రెండు పంటలకు నీరివ్వలేక, అదనపు ఆయకట్టు 6 వేల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నీటి నిల్వలు చాలవని ఇప్పటివరకు చెప్పుకొచ్చిన జల వనరుల శాఖ అధికారులు మిన్నకుండటం సరికాదన్నారు. విలేకరుల సమావేశానికి ముందు తెదేపా నాయకులంతా కలిసి జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, శరఖాన సూర్యనారాయణ, మహేశ్వరీ నాయుడు, గోవింద, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు దృష్టికి తీసుకెళతా

అదాని హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రైవాడ రైతాంగానికి పొంచి ఉన్న ముప్పుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతానని మాడుగుల తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైవాడ జలాశయానికి నదీ జలాలను అందించే ప్రధాన నీటి వనరులకు అడ్డంగా జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించడం రైతాంగానికి తీరని నష్టం కలుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని