logo

2500 మందితో భద్రత

నగరంలో జరుగుతున్న జి-20 సన్నాహక సదస్సు విజయవంతానికి భద్రతలో భాగంగా 2500 మంది సిబ్బందిని నియమించినట్లు నగర పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌ వెల్లడించారు.

Published : 27 Mar 2023 03:55 IST

నగర పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : నగరంలో జరుగుతున్న జి-20 సన్నాహక సదస్సు విజయవంతానికి భద్రతలో భాగంగా 2500 మంది సిబ్బందిని నియమించినట్లు నగర పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌ వెల్లడించారు. ఆదివారం పోలీసు సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

*  ప్రతినిధులు తొలిరోజు రాడిసన్‌ బ్లూ హోటల్‌, కైలాసగిరి, వీఎంఆర్‌డీఏ పార్కు, ఆర్కేబీచ్‌ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. 28, 29 తేదీల్లో రాడిసన్‌ బ్లూహోటల్‌లో జరిగే సదస్సులో పాల్గొంటారు. ఈనెల 30న వర్క్‌షాప్‌ అనంతరం పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన పలు ప్రాజెక్టులైన కాపులుప్పాడ ఎనర్జీప్లాంట్‌, మాధవధార 24×7 నీటి పథకం తదితర వాటిని సందర్శిస్తారు.

* ఈ సదస్సు భద్రతకు 1850 మంది పోలీసులు, 400 మంది ఎ.ఆర్‌ పోలీసులు, 4 గ్రేహౌండ్స్‌ యూనిట్లు, 2 క్యూఆర్‌టీ బృందాలు, 6 స్పెషల్‌పార్టీలు, 2 ఏపీఎస్‌పీ ప్లటూన్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. సదస్సులో భాగంగా గత 15 రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టాం. జి-20 ప్రతినిధులు ప్రయాణించే మార్గాల్లో రూట్‌ బందోబస్తులతో పాటు వి.ఐ.పి.లు ప్రయాణించే మార్గాల్లోను, సదస్సు వద్ద పూర్తి నిఘా ఏర్పాటు చేశాం. ఇప్పటికే అతిథులు తిరిగే ప్రాంతాల్లోను, సదస్సు జరిగే ప్రాంగణం, బస చేసే హోటళ్ల వద్ద తాత్కాలిక రెడ్‌ జోన్‌ను ప్రకటించి డ్రోన్ల కార్యకలాపాలను నిషేధించాం.

*  ఈనెల 27, 28, 29, 30 తేదీల్లో విమానాశ్రయం రహదారి, రాడిసన్‌ బ్లూహోటల్‌, బీచ్‌రోడ్డు, సందర్శనీయ ప్రాంతాల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలి. స్వాగత ఏర్పాట్లతో పాటు విదేశీ అతిథులకు కల్పించిన భద్రతా సిబ్బందికి ఇప్పటికే సాప్ట్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వటం జరిగింది.

*  అతిథులు సందర్శించే పర్యాటక ప్రాంతాల్లో 24 గంటల ముందు నుంచి పర్యాటకుల అనుమతులు ఉండవు. కేవలం జి-20 ప్రతినిధులు, అతిథులు ప్రయాణించే సమయంలోనే తప్ప మరే ఇతర ఆంక్షలు ఉండవు. మాకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు 59 మంది విదేశీ ప్రతినిధులు రాగా.. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

*  విమానాశ్రయం, తాటిచెట్లపాలెం, వేమనమందిరం, సిరిపురం, సీఆర్‌రెడ్డి సర్కిల్‌, కురుపాం సర్కిల్‌, రాడిసన్‌ బ్లూ వరకు ప్రజలు, వాహనదారులు నగర పోలీసులకు సహకరించి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలి.


పోలీసు సిబ్బందికి విధులు కేటాయిస్తున్న అధికారులు

పెదవాల్తేరు: ఆదివారం సాయంత్రం బీచ్‌రోడ్డు ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లోనూ సీపీ వీఐపీలు సందర్శించే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు అవగాహన కల్పించారు. ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు.


సన్నద్ధమవుతున్న పోలీసు సిబ్బంది

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: సదస్సులకు విదే, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతుండటంతో పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. పెద్ద సంఖ్యలో పోలీసులను బందోబస్తుకు నియమించింది. ఇతర జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బందిని సైతం నగరానికి రప్పించారు. వీరంతా ఆదివారం విధులకు హాజరయ్యారు. విదేశీయులతో ఉన్న సమయంలో ఎలా వ్యవహరించాలి? వారితో ఎలా మెలగాలి? అనే అంశాలను వివరించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు