logo

ఉత్తరాంధ్రపై ప్రేమంటే ఇదేనా..!

విశాఖను రాజధాని చేసి తీరతాం.. మరికొద్ది నెలల్లో ముఖ్యమంత్రి మకాం ఇక్కడకు మార్చబోతున్నారు.. ఈ ప్రాంతం దశ, దిశ మారిపోతుందం’టూ స్థానిక వైకాపా నేతలు ఊదరగొడుతున్నారు.

Published : 28 Mar 2023 04:16 IST

బడ్జెట్‌ కేటాయింపుల్లో సుజలస్రవంతికి ఏటా నిరాశే
అరకొర నిధులిస్తే.. అడుగులు పడేదెట్టా..?
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా పెదపూడి వద్ద రిజర్వాయర్‌ నిర్మించాల్సిన ప్రాంతం

విశాఖను రాజధాని చేసి తీరతాం.. మరికొద్ది నెలల్లో ముఖ్యమంత్రి మకాం ఇక్కడకు మార్చబోతున్నారు.. ఈ ప్రాంతం దశ, దిశ మారిపోతుందం’టూ స్థానిక వైకాపా నేతలు ఊదరగొడుతున్నారు. సీఎం జగన్‌ కూడా పలు సందర్భాల్లో ఉత్తరాంధ్రపై ప్రేమను ఒలకబోస్తున్నారు.. రాజధాని అంటూ పేరు పెట్టడం మీద చూపుతున్న ఈ అభిమానం తమపై చూపడం లేదని ఈ ప్రాంత అన్నదాతలు స్పష్టంచేస్తున్నారు.

మూడు జిల్లాల రైతులకు కీలకమైన బాబూ జగ్జీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత నాలుగేళ్లగా బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు చూస్తేనే తమపై ఎంత ప్రేముందో అర్థమైపోతుంది అంటున్నారు. భూసేకరణ, నిర్మాణ పనులకు రూ.వేల కోట్లలో అవసరమని ప్రతిపాదిస్తే రూ.వందల కోట్లలో కేటాయిస్తున్నారు..వాటిని కూడా విడుదల చేయకుండా ఖాతాల్లో అట్టిపెట్టుకోవడంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు.

ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు దశల్లో రూ.17,050 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును పూర్తిచేయడానికి పరిపాలనా అనుమతులు ఎప్పుడో ఇచ్చారు.

*  తొలిదశ పనులను రెండు ప్యాకేజీలుగా 2017లోనే రూ.2,022 కోట్ల అంచనా విలువతో గుత్తేదారుకు పనులు అప్పగించారు. తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ పనులు పూర్తిగా మందగించాయి.

*  వైకాపా ప్రభుత్వం వచ్చాక రెండోదశలో చేపట్టాల్సిన మరో రెండు ప్యాకేజీ పనులను రూ.3,800 కోట్లతో రెండు సంస్థలకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఇవ్వాల్సిన నిధుల విషయంలోనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. టెండర్లు పిలిచి పనులు అప్పగించడంలో చూపిన చొరవ బడ్జెట్‌లో కేటాయింపులపై చూపక పోవడంతో నాలుగేళ్లయినా తొలిదశ పనులు ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు.

తీడ గ్రామానికి సమీపంలో ప్రాజెక్ట్‌ పనుల కోసం గుత్తేదారు సంస్థ నిర్మించుకున్న తాత్కాలిక వసతి

అత్తెసరుగానే నిధులు

సుజలస్రవంతి రెండు దశల్లోని నాలుగు ప్యాకేజీలకు కలిపి 16,046 ఎకరాలు అవసరం అవుతాయి. వీటిలో ఇప్పటి వరకు 7,406 ఎకరాలకు సర్వే పూర్తిచేసి ల్యాండ్‌ పొజిషన్‌ (ఎల్‌పీ) షెడ్యూల్‌ను విడుదల చేశారు. మిగతా తొమ్మిది వేల ఎకరాల సర్వే తుదిదశలో ఉంది. రైతులకు పరిహారం చెల్లించి ఆ భూములను సేకరించాల్సి ఉంది. దీనికోసం ముందుగా రూ.2 వేల కోట్లు, సివిల్‌ వర్క్స్‌ కోసం మరో రూ.2 వేలు కోట్లు అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు. ఆ మేరకు నిధులు కోరితే అందులో 30 శాతమైనా ఇస్తారని ఆశించారు. అయిదు శాతం నిధులు కూడా బడ్జెట్‌లో కేటాయించడం లేదు.


గతేడాది రూ.297 కోట్లు కేటాయించినా కేవలం రూ.8.78 కోట్లు మాత్రమే సర్వే, ఇతర పనులకు ఖర్చుచేశారు.

గతేడాది రూ.900 కోట్లు విడుదల  చేయాలని కోరినా సర్కారు స్పందించలేదు సరికదా తాజా బడ్జెట్‌లో గతేడాది కంటే రూ.155.71 కోట్లు కోతపెట్టడం విశేషం.

ఈ నిధులతో భూసేకరణకు ఎలా వెళ్లాలో అధికారులకు తెలియక సర్వేలు..నిర్మాణాల నమూనాలపై కసరత్తుతోనే సరిపెట్టుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు