logo

మాటువేసి.. లంచగొండి ఆటకట్టించి..

మాడుగుల ఘాట్‌రోడ్డు కూడలిలో సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ మోటారుకు విద్యుత్తు కనెక్షన్‌ జారీకి లంచం తీసుకుంటుండగా విద్యుత్తు సహాయ లైన్‌మేన్‌ (ఏఎల్‌ఎం) వి.రమేష్‌ ఏసీబీకి పట్టుబడ్డారు.

Published : 28 Mar 2023 04:16 IST

అనిశా వలలో సహాయ లైన్‌మేన్‌

మాట్లాడుతున్న ఏఎస్పీ షకీలాబాను, డీఎస్‌పీ రమణమూర్తి

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల ఘాట్‌రోడ్డు కూడలిలో సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ మోటారుకు విద్యుత్తు కనెక్షన్‌ జారీకి లంచం తీసుకుంటుండగా విద్యుత్తు సహాయ లైన్‌మేన్‌ (ఏఎల్‌ఎం) వి.రమేష్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. అనిశా ఏఎస్పీ షకీలాబాను కథనం ప్రకారం.. రాజాం గ్రామానికి చెందిన ఉమ్మడివరపు రమేష్‌ ఎం.కోడూరులో  ఏఎల్‌ఎంగా పనిచేస్తూ వీరవిల్లిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరవిల్లి శివారు ఎరుకువాడ వద్ద జి.గొట్టివాడకు చెందిన గుమ్మిడి కొండలరావు భార్య గోవిందకు 90 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ వ్యవసాయ మోటారుకు విద్యుత్తు కనెక్షన్‌ కోసం కొండలరావు సంప్రదించారు. దీనికి రూ. 45 వేలు ఖర్చు అవుతుందని రమేష్‌ చెప్పగా దఫదఫాలుగా చెల్లించారు. మరో రూ. 15 వేలు ఇవ్వాలని  అడగడంతో విసుగెత్తిన ఆయన ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబరు 14400కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు ప్రణాళిక రచించారు. ఘాట్‌రోడ్డు కూడలిలో జ్యూస్‌ దుకాణం వద్ద కొండలరావు నుంచి రూ. 15 వేలు రమేష్‌ తీసుకుంటుండగా మాటువేసి పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఇలా ఎవరైనా ఉద్యోగులు తమకు పనులు చేయడానికి వేధించి లంచాలు అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరుకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఎస్పీ బీవీఎస్‌ ఎస్‌.రమణమూర్తి, సి.ఐ.లు సురేష్‌ కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, రామకృష్ణ, ఎస్సైలు సురేష్‌, మనోజ్‌ పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 12వ కేసుగా ఏఎస్‌పీ తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబరు వచ్చాక అందరిలో చైతన్యం వచ్చిందన్నారు. అవినీతికి సంబంధించి తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏఎల్‌ఎం రమేష్‌

బాధితుడు కొండలరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు