logo

ఉంచితే కంపు.. పంపితే ఖర్చు!

పంచాయతీల్లో సంపద కేంద్రాలు నిర్మించినా కొన్ని నిరుపయోగంగా మిగిలాయి. దీంతో చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే జిందాల్‌ కంపెనీకి గ్రామాల్లో చెత్తను పంపించే చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు.

Published : 28 Mar 2023 04:16 IST

జిందాల్‌కు చెత్త తరలింపుపై పంచాయతీలకు సంకటం
చోడవరం, న్యూస్‌టుడే

చోడవరం పంచాయతీ పార్కులో ఆసుపత్రి వ్యర్థాల దహనం

పంచాయతీల్లో సంపద కేంద్రాలు నిర్మించినా కొన్ని నిరుపయోగంగా మిగిలాయి. దీంతో చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే జిందాల్‌ కంపెనీకి గ్రామాల్లో చెత్తను పంపించే చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ఈ వ్యవహారం పంచాయతీలకు సంకటస్థితి మిగిల్చింది. పరవాడ వద్ద ఉన్న జిందాల్‌ విద్యుత్తు ప్లాంట్‌కు చెత్తను పంపించాలని పంచాయతీ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. అధికారుల మాట విని ఈ పనిచేస్తే పంచాయతీల ఖజానా ఖాళీ అవుతోందని కార్యదర్శులు, సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు.

* చెత్తను మంట పెట్టకూడదన్న నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. చెత్త అంతా ఓ చోట వేసి అగ్గి పెట్టేస్తున్నారు. కాలిన చెత్త నుంచి దుర్వాసన రావడంతో ప్రజలు ఈ పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చోడవరంలో యడ్లవీధి శ్మశాన వాటికలో తరచూ రాత్రిళ్లు చెత్తను దహనం చేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు పలు దఫాలు పంచాయతీకి ఫిర్యాదు చేయగా ఓ దఫా నీళ్ల టాంకులతో మంటలను ఆపారు. మళ్లీ షరా మామూలే! చోడవరం పార్కులో ఆసుపత్రి వ్యర్థాలు పడేస్తున్నారు. ఆ వ్యర్థాలనూ తగలబెడుతున్నారు.

అధికారుల మాటలు విని చోడవరం పంచాయతీ రెండు లోడులు, గోవాడ ఒక లోడ్‌ చెత్తను పరవాడకు లారీల్లో పంపించాయి. దీనికోసం ఒక్కో పంచాయతీకి రోజుకు రూ. పాతిక వేల వరకు వ్యయమైంది. ఈ వ్యయాన్ని పంచాయతీలే భరించాయి. చెత్తను ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసే జిందాల్‌ కంపెనీ పైసా కూడా చెల్లించడం లేదు. దీంతో చేతిచమురు వదులుతోందని, చెత్తను పంపించేందుకు పంచాయతీలు విముఖత చూపాయి. కొన్ని పంచాయతీలు సంపద కేంద్రంలో వర్మీ కంపోస్ట్‌ తయారీకి ఉపక్రమించాయి. వర్మీ కంపోస్టు తీసుకెళ్లేందుకు రైతులు పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో పేరుకుపోతున్న వ్యర్థాలు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జిందాల్‌కు పంపిద్దామంటే ఖర్చు చూసి భయపడుతున్నారు.

గోవాడలో చెత్త సంపద కేంద్రంలో..


ప్రైవేట్‌ కంపెనీలపై ప్రేమ..

స్థానిక సంస్థలు ఎలా పోయినా ఫర్వాలేదు. కంపెనీల యజమానులకు మేలు చేయాలన్న రీతిలో ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. పంచాయతీలో సేకరించిన చెత్తను ఉచితంగా ప్రైవేట్‌ కంపెనీకి తరలించాలని చెప్పడం శోచనీయం. ఆ కంపెనీల నుంచి పంచాయతీలకు ఆదాయం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అసలే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇక పంచాయతీ సొమ్ముతో చెత్తను తరలించడమంటే అంత భారం మోయలేం.

బొడ్డేడ రాము  నాయుడు, సర్పంచి, రాయపురాజుపేట


ఆర్థిక భారమని..

జిందాల్‌కు ఇక్కడి నుంచి చెత్తను లారీల్లో పంపించాం. రవాణా ఛార్జీలు అధికమవుతున్నాయంటూ కార్యదర్శులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని  అధికారులకు విన్నవించాం. చెత్తను జిందాల్‌కు పంపించాలన్న నిబంధన లేదు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రధాన రహదారి పక్కన రహదారి పక్కన చెత్త వేయకుండా డేరాలు ఏర్పాటు చేశాం. సంపద కేంద్రాలను చాలా పంచాయతీలు వినియోగించుకుంటున్నాయి. మొదటి ప్రాధాన్యం పారిశుద్ధ్యం మెరుగుపరచడమే.

చైతన్య, ఈఓఆర్‌డీ, చోడవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని