logo

వైకాపా ప్రభుత్వానికి పతనం ప్రారంభం..

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు వైకాపా ప్రభుత్వ పతనానికి ప్రారంభమని.. తెదేపా విజయానికి ఆరôభమని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

Published : 28 Mar 2023 04:16 IST

ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

కప్పస్తంభం వద్ద ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెదేపా కార్పొరేటర్లు

సింహాచలం, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు వైకాపా ప్రభుత్వ పతనానికి ప్రారంభమని.. తెదేపా విజయానికి ఆరôభమని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల నియోజకవర్గం, ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికలు వైకాపా ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టాయన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా 50శాతానికి పైగా ఓట్లు సాధిస్తే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 29 శాతానికి పడిపోవడం గమనార్హమన్నారు. పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం వాస్తవమవుతోందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌, భాజపాకు వచ్చిన ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనన్నారు. వారు పోటీ చేయకపోతే ఆ ఓట్లు కూడా తెదేపాకు వచ్చేవని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా గంజాయి సరఫరా చేసే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారడం దురదృష్టకరమన్నారు.  రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండబోదని అభిప్రాయపడ్డారు. గంటాతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు, 98వ వార్డు కార్పొరేటర్‌ పీవీ.నరసింహం, 93వ వార్డు కార్పొరేటర్‌ బల్ల శ్రీనివాసరావు, 97, 98 వార్డుల తెదేపా అధ్యక్షులు శానాపతి శంకర్రావు, పంచదార్ల శ్రీనివాసరావు, తదితరులు అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని