logo

భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి

ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు కోల్పోయిన రైతులకు రావలసిన ప్లాట్లను జెడ్పీటీసీ సభ్యుడు సుంకర గిరిబాబు, అతని సంబంధీకులకు కేటాయించారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 28 Mar 2023 04:16 IST

ప్లాట్ల కేటాయింపుపై సమగ్ర విచారణకు డిమాండ్‌

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న రైతులు

పద్మనాభం, న్యూస్‌టుడే: ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు కోల్పోయిన రైతులకు రావలసిన ప్లాట్లను జెడ్పీటీసీ సభ్యుడు సుంకర గిరిబాబు, అతని సంబంధీకులకు కేటాయించారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం బాధిత రైతులు మెరుపు ధర్నాకు దిగారు. జెడ్పీటీసీ సభ్యునికి, అతని అనుచర వర్గానికి కేటాయించిన ప్లాట్లను తక్షణమే రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు ఇప్పించాలని రైతులు నినాదాలు చేశారు. మండలంలోని గంధవరం, నరసాపురం, తునివలస, నేరెళ్ళవలస, విజయరాంపురం తదితర గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌లో 200 మంది రైతుల నుంచి 300 ఎకరాల భూములు సేకరించారు. ప్రభుత్వం పరిహారంగా ఇస్తామన్న ప్లాట్లు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రైతుకు కేటాయించ లేదని వాపోయారు. అసలు భూములివ్వని జెడ్పీటీసీ సభ్యునికి, ఆయన కుటుంబ సభ్యులకు అప్పటి స్థానిక రెవెన్యూ అధికారులు సుమారు 70 ఎకరాల మేర ప్లాట్ల కేటాయింపులు చేసినట్లు ఆరోపించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా దాన్ని బుట్ట దాఖలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి సమగ్ర విచారణ జరిపించి నిజమైన అర్హులకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం జెడ్పీటీసీ సభ్యుడు సుంకర గిరిబాబు వద్ద ప్రస్తావించగా..తాను రైతుల నుంచి భూమి కొనుగోలు చేశాను తప్ప, ఎవరి వద్దా లాక్కోలేదని, ఆక్రమించలేదని అన్నారు. ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని పేర్కొన్నారు. కొంత మంది రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని