logo

నేర వార్తలు

కొబ్బరి చెట్టు పైనుంచి బోండాలు తెంచే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. నక్కపల్లి మండలం రమణయ్యపేటకు చెందిన వీర్ల సురేష్‌ (34) బయట ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్తుంటాడు.

Updated : 28 Mar 2023 04:55 IST

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

నక్కపల్లి, న్యూస్‌టుడే: కొబ్బరి చెట్టు పైనుంచి బోండాలు తెంచే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. నక్కపల్లి మండలం రమణయ్యపేటకు చెందిన వీర్ల సురేష్‌ (34) బయట ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్తుంటాడు. కొత్త అమావాస్య పండగకు ఇంటికి వచ్చిన ఆయన ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద కొబ్బరి చెట్టు నుంచి బోండాలను ఇనుప చువ్వతో తెంచేందుకు యత్నించగా.. పట్టుతప్పి పక్కనే ఉన్న హెచ్‌టీ లైన్‌ను తగలడంతో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. మృతుడి భార్య భవ్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. సురేష్‌కు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు చేశారు. సురేష్‌ మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది.


బియ్యం బస్తాల మాటున గంజాయి రవాణా

కశింకోట, న్యూస్‌టుడే: బియ్యం బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ  రవికుమార్‌ కథనం ప్రకారం..  నర్సీపట్నం నుంచి అనకాపల్లి వైపు బియ్యం బస్తాల లోడుతో వస్తున్న లారీని కశింకోట ఎస్సై ఎ.ఆదినారాయణరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ ఆదివారం అర్థరాత్రి తనిఖీ చేశారు. లారీ లోపల గంజాయి బస్తాలు బయట పడ్డాయి. డ్రైవరు హరదేవ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గుప్తా అనే వ్యక్తి మన్యం నుంచి గంజాయిని కొనుగోలు చేసి బిహార్‌, జార్ఖండ్‌, హరియాణా రాష్ట్రాలకు రవాణా చేస్తుంటాడని తెలిపాడు. ఈ క్రమంలో తన లారీని కిరాయికి తీసుకొని బియ్యం బస్తాల మాటున గంజాయిని తరలిస్తున్నట్లు పేర్కొన్నాడు. రూ. 18 లక్షల విలువ చేసే 890 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అనకాపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచినట్లు సీఐ వివరించారు.


23 కేజీల గంజాయి స్వాధీనం

రాజమహేంద్రవరం నేరవార్తలు: విశాఖ ఏజెన్సీ నుంచి కేరళ రాష్ట్రానికి గంజాయి రవాణా చేస్తున్న అయిదుగురిని అరెస్టు చేసినట్లు రాజమహేంద్రవరం సెబ్‌ ఉత్తర స్టేషన్‌ సీఐ పి.వెంకటరమణ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న అయిదుగురిని సెబ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నాలుగు సంచుల్లో 23.410 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. డొంక ప్రదీప్‌కుమార్‌, నయన సురేష్‌ (విశాఖపట్నం), బాకా గోవర్ధన్‌ (అరకు) ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన టిస్సన్‌ జోసఫ్‌, జిస్టు కంజిరతిల్‌లకు అమ్ముతుంటారు. వారు ఆ రాష్ట్రానికి తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ముగ్గురూ మార్గంమధ్యలో గంజాయిని జోసఫ్‌, రతిల్‌కు అందజేసే క్రమంలో రాజమహేంద్రవరంలోని సెబ్‌ అధికారులకు చిక్కారు. ఏజెన్సీలో రూ.లక్షకు కొనుగోలు చేసి, తిరిగి రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారని, గత ఆరు నెలలుగా వీరు ఈ వ్యాపారం చేస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేెలిందని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని