logo

రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ఎందుకు విస్మరిస్తోంది : తెదేపా

రాష్ట్రం నాశనమైపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, తెదేపా నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు.

Published : 29 Mar 2023 02:36 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రం నాశనమైపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, తెదేపా నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. ఆయన మంగళవారం విశాఖలో మాట్లాడుతూ కోడి కత్తి, వైఎస్‌ వివేకానంద హత్య కేసు తదితరాల విచారణ ఏళ్ల తరబడి నడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని కోరుతుంటే అమ్మేస్తామని వారానికోసారి చెబుతున్నారు. వీటిపై ఐకమత్యంగా పోరాడాలి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, హడావుడిగా పూర్తిచేసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం పెట్టుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. అదే చేస్తే మేం అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తొలగించి గంగలో కలిపేస్తాం. 45.71 మీటర్ల ఎత్తులోనే నిర్మించి విగ్రహం పెట్టుకోండి. రూ.16,000 వేల కోట్లు ఖర్చయ్యే సుజల స్రవంతికి జీతాలకు సరిపోయేలా రూ.141 కోట్లు ఇచ్చారు. ప్రతిసారి దిల్లీ పారిపోయే జైలు పక్షితో పనులు జరగవు’ అని అన్నారు. తెదేపా విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రాంతీయ మనోభావాలను పట్టించుకోవడం లేదన్నారు. అదానీతో కలసి విశాఖ ఉక్కులో వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక కారణంగా ఆ ప్రక్రియ నెమ్మదించిందన్నారు. లేకుంటే స్టీల్‌ప్లాంట్‌ను అదానీ కొనేవారని, అందుకే పక్కనే ఉన్న గంగవరం పోర్టును ఆయనకు విక్రయించారన్నారు. అలాంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని