logo

భూగర్భ జలం అడుగంటుతోంది..!

ఈ వేసవిలో విశాఖ నగరంలో నీటికి ఇక్కట్లు తప్పేలా లేవు. అనధికారికంగా ఎక్కడికక్కడ బోర్లు తవ్వి తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నగర శివారులోని ఏసీఏ, వీడీసీఏ స్టేడియంకు ఎదురుగా ఉన్న పలు అపార్టుమెంట్లలో ఇప్పటికే బోర్లు పనిచేయడంలేదు.

Published : 29 Mar 2023 03:15 IST

ఇష్టారాజ్యంగా బోర్ల తవ్వకం
నగర శివార్లలో నీటికి ఇక్కట్లు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ఓ నిర్మాణ స్థలంలో వేసిన బోరు

వేసవిలో విశాఖ నగరంలో నీటికి ఇక్కట్లు తప్పేలా లేవు. అనధికారికంగా ఎక్కడికక్కడ బోర్లు తవ్వి తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నగర శివారులోని ఏసీఏ, వీడీసీఏ స్టేడియంకు ఎదురుగా ఉన్న పలు అపార్టుమెంట్లలో ఇప్పటికే బోర్లు పనిచేయడంలేదు. ఇక్కడ 150 అడుగుల లోతు వరకు తవ్వినా బోర్లకు నీరు అందడం లేదు. నివాసితులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మధురవాడ, కొమ్మాది, మారికవలస తదితర ప్రాంతాల్లో మరో నెల రోజుల వ్యవధిలో భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అనంతరం ఆదర్శనగర్‌, రవీంద్రనగర్‌, ఆరిలోవ, ఎంవీపీకాలనీ, హెచ్‌బీకాలనీలలోనూ నీటి ఎద్దడి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. నగర శివార్లలో భారీ భవనాలు నిర్మించి హైటెక్‌ బోర్లు తవ్వి నీటిని ఇష్టానుసారంగా తోడేయడమే ఈ దుస్థితికి కారణమని వివరిస్తున్నారు.

లోపించిన ‘మహా’ పర్యవేక్షణ

తీరానికి ఆనుకుని ఉన్న నగరంలో భూగర్భ జలాల సంరక్షణపై మహా విశాఖ నగరపాలక సంస్థ పర్యవేక్షణ కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. బీచ్‌రోడ్డులో నిర్మాణదారులు, వాణిజ్య సముదాయాల యజమానులు భూమి పొరల్లోని నీటిని తోడేస్తుండడంతో ఉప్పునీరు నగర భూగర్భంలోకి చొచ్చుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు మేల్కొన్న దాఖలాలు లేవు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగర భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారిపోయే ప్రమాదముంది.


సీఆర్‌జడ్‌ నిబంధనల మేరకు జీవీఎంసీ అధికారులు తరచూ తీరం ఒడ్డున ఉన్న భారీ అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లలో బోర్ల వినియోగంపై తనిఖీలు చేయాల్సి ఉంది. 2014లో బీచ్‌ రోడ్డులో అప్పటి జోనల్‌ కమిషనర్‌ 53 బోర్లను సీజ్‌ చేశారు. ఆ తరువాత వాటి వినియోగం తీరుపై ఎవరూ దృష్టి సారించకపోవడంతో మళ్లీ యథావిధిగా పనిచేస్తున్నాయి.


2019లో హనుమంతువాక నుంచి ముడసర్లోవ వరకు ఉన్న హెల్త్‌ సిటీలో ఆసుపత్రులు వినియోగిస్తున్న ఆరు బోర్లను జీవీఎంసీ మంచినీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారులు సీజ్‌ చేశారు. తర్వాత వాటి పరిస్థితిపై ఇప్పటి వరకు తనిఖీ చేయకపోవడం గమనార్హం. జీవీఎంసీ నుంచి మంచి నీటిని కొనుగోలు చేయాలంటే కిలోలీటరుకు రూ.50 చెల్లించాలి. దీంతో ఉచితంగా వచ్చే భూగర్భ జలాన్ని వాణిజ్య సముదాయాలు, ఇతర భారీ భవనాల యజమానులు తోడేసి వాడుకుంటున్నారు.


నిర్మాణ సమయంలోనే బోర్లు..: నిబంధనల మేరకు భారీ భవనాల నిర్మాణ సమయంలో అవసరమైన నీటిని జీవీఎంసీ నుంచి కొనుగోలు చేసుకుని వినియోగించుకోవాలి. నగరంలో ప్రస్తుతం ఎక్కడా ఆ పరిస్థితులు కనిపించడంలేదు. నిర్మాణం ప్రారంభించక ముందే బోర్లు తవ్వేస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ బంగ్లాకు ఆనుకుని సిద్ధమవుతున్న ఓ నిర్మాణం వద్ద 12 బోర్లు వేశారు. వీటికి జీవీఎంసీ, భూగర్భ జలాల పర్యవేక్షణశాఖల నుంచి అనుమతులు లేవు. ఒకే ప్రాంతంలో 12 బోర్లు వేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి అనధికారంగా వినియోగంలో ఉన్న బోర్లను తొలగించి భూగర్భ జలాలను రక్షించాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని