logo

నీరు నీడా లేదు!

గరిష్ఠవేతనం కావాలంటే రెండు పూటలా పనికి వెళ్లాలంటున్నారు.. పరదాల్లేకపోవడంతో చెట్లనీడనే సేదతీరాలని సలహాలిస్తున్నారు.. పనిచేసే చోట ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు ఉంచడం లేదు.

Published : 30 Mar 2023 04:34 IST

పని ప్రదేశాల్లో కానరాని కనీస సదుపాయాలు
ఉపాధి వేతనదారుల పరిస్థితి దయనీయం
ఈనాడు డిజిటల్‌, పాడేరు - న్యూస్‌టుడే, పాడేరు

ఎండలో పనిచేస్తున్న కూలీలు

‘ఉపాధిహామీ పనికి వెళ్లే వేతనజీవులకు ఎండల నుంచి ఉపశమనం కోసం పరదాలు ఇచ్చేవారు..
పనిచేసే చోట ఏమైనా గాయాలైతే ప్రథమ చికిత్స కిట్‌లు అందుబాటులో పెట్టేవారు.
వేసవిలో మజ్జిగ సరఫరా చేసేవారు..
మంచినీళ్లు తెచ్చుకున్నా..
పనిలో గునపం వినియోగించే కూలీలకు వారి
వేతనంలో కొంత మొత్తం కలిపేవారు.
ఎండ కాలం మొదలు అదనపు భత్యం ఇచ్చి ప్రోత్సహించేవారు’.
ఇదంతా రెండేళ్ల కిందటి మాట..

రిష్ఠవేతనం కావాలంటే రెండు పూటలా పనికి వెళ్లాలంటున్నారు.. పరదాల్లేకపోవడంతో చెట్లనీడనే సేదతీరాలని సలహాలిస్తున్నారు.. పనిచేసే చోట ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు ఉంచడం లేదు. మజ్జిగ మాట అటుంచి మంచినీళ్ల సదుపాయం కూడా లేదు. గునపానికి డబ్బుల ఊసేలేదు.. వేసవి భత్యం కూడా కలవడం లేదు. మండుటెండలో పనిచేయలేక వేతనదారులు విలవిల్లాడిపోతున్నారు.
ఇదీ గతేడాది నుంచి ఉపాధి వేతనదారుల వెతలు

పనులు.. వేతనాలపైనా ప్రభావం

పాధి పథకం అమలులో తీసుకువచ్చిన మార్పులు వేతనజీవులకు శరాఘాతంలా మారాయి. ఉమ్మడి జిల్లాలో 5.66 లక్షల మంది వేతనదారులున్నారు. వీరికి పని ప్రదేశాల వద్ద కనీస సదుపాయాలు కల్పించడం లేదు. గతేడాది వర్షాలు ఆలస్యంగా పడటంతో ఇప్పటికి చాలాచోట్ల చెరువుల్లో కొద్దిపాటి నీరు ఉంది. దీంతో సొంత గ్రామాల్లో పనులు అందుబాటులో లేక, దూరంగా ఇతర ప్రాంతాల్లో పనులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది దూరాభారం నడిచి వెళ్లి వస్తున్నారు. భగభగమండే ఎండల్లో గంటల తరబడి మట్టి పనులు చేయాల్సి రావడంతో శ్రమజీవులు అలసటకు గురవుతున్నారు. సేదతీరడానికి సమీపంలో ఎక్కడా నీడ లేక చెట్లు పుట్టలు చాటున గంజినీళ్లు తాగుతున్నారు. గతేడాది నుంచి వేసవి భత్యం కూడా కలపడం లేదు. ఫలితంగా వేతనదారులు గరిష్ఠ వేతనానికి దూరంగా నిలిచిపోవాల్సి వస్తోంది. రోజుకు రూ.257 వేతనం సంపాదించడానికి అవకాశం ఉన్నా రూ.200 మించి వేతనం అందుకోలేకపోతున్నారు.

సదుపాయాలు సున్నా..

‘ఉపాధి కూలీలకు టెంట్లు ఎప్పుడు సరఫరా చేస్తారు?, మండుటెండలో పని చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేసవికి ముందే ఏర్పాటు చేయాలి కదా.’ అంటూ ఫిబ్రవరిలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఓ జడ్పీటీసీ సభ్యుడు డ్వామా అధికారులను ప్రశ్నించారు. టెంట్ల సరఫరా కోసం టెండర్‌ పిలుస్తామని సమాధానమిచ్చిన అధికారులు మార్చి నెల ముగుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయలేదు. గత కొన్నిరోజులుగా వేసవి ఎండలు మండిపోతున్నాయి. పనిచేసే చోట ప్రథమ చికిత్స కిట్‌ ఉన్నా లేకున్నా కనీసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లయినా అందుబాటులో ఉంచాలి. అవి కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నీళ్ల సీసా అయిపోతే గొంతు తడుపుకోవడానికి గంటల తరబడి నిరీక్షించాల్సిందే. అలాంటప్పుడు వడదెబ్బకు గరయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు.


ఎవరూ పట్టించుకోవడంలేదు: గతంలో పనికి వెళ్తే మజ్జిగ ఇచ్చేవారు, తాగునీటికి డబ్బులు చెల్లించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనిపై వీఆర్పీని అడిగితే అవేవీ ఇప్పుడు ఇవ్వడంలేదని చెబుతున్నారు. ఎండగా ఉంది ఎక్కడైనా కూర్చుందామంటే నీడ కనబడటంలేదు. గంజినీళ్లు కూడా ఎండలోనే తాగాల్సి వస్తోంది. మున్ముందు ఎండలు మరింత పెరుగుతాయి. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఆర్‌.సత్యవతి, కె.సూర్యకాంతం


దెబ్బ తగిలితే ఆసుపత్రికే వెళ్లాలి: ఉపాధి పనికి మా గ్రామంనుంచి చాలా మంది ఎంతదూరమైనా నడిచే వెళుతున్నాం. పని ప్రాంతంలో ఎవరికైనా చిన్నచిన్న గాయాలైతే, గతంలో చికిత్స చేసుకోవడానికి కిట్‌ దగ్గరే ఉండేది. ఇప్పుడ ఆ కిట్‌లు ఏవీలేవు నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిందే. పొట్టకూటికి పని చేసుకోవాలి కాబట్టి ఇబ్బందులు పడుతున్నా పనిలోకి వెళుతున్నాం.

యు.లక్ష్మి, కె.అమ్మాజీ


ప్రత్యేకంగా నిధులేమీ లేవు..: ఉపాధి కూలీల రక్షణ కోసం గతంలో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులుండేవి. పనిచేసే చోట నీడ కల్పించేందుకు టెంటుల ఏర్పాట్లు, మందుల కిట్లు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించేవాళ్లం. ప్రస్తుత వేసవి కాలంలో ఎండల నుంచి కూలీలు ఉపశమనం పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక నిధులేవీ రావడం లేదు. కూలీలకు ఈ ఖర్చులన్నీ కలిపి చెల్లిస్తున్నారు. మొన్నటివరకు ఒక్కో కూలీకి వేతనం రూ.257 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.15 మేర పెరిగింది.

రమేష్‌రామన్‌, డ్వామా పీడీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని