logo

రెప్పపాటులో ఘోరం

వారంతా మరో గంటలో ఇంటికి  చేరుకుంటారనగా..అంతలోనే ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు కబళించింది.

Published : 30 Mar 2023 04:33 IST

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
తల్లీకొడుకుల మృతి
నలుగురికి తీవ్ర గాయాలు

పాయకరావుపేట గ్రామీణం, మల్కాపురం, న్యూస్‌టుడే: వారంతా మరో గంటలో ఇంటికి  చేరుకుంటారనగా..అంతలోనే ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యువు కబళించింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో తల్లీ కొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాయకరావుపేట సీఐ అప్పలరాజు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం 62వ వార్డు పరిధిలోని మల్కాపురానికి చెందిన డాక్‌యార్డు ఉద్యోగి కోలా శ్రీనివాసరావు (51) కుటుంబ సభ్యులతో కలిసి అమలాపురం దగ్గర గన్నవరంలో బంధువు చనిపోవడంతో వెళ్లారు.

కార్యక్రమం ముగించుకుని తిరిగి మంగళవారం రాత్రి విశాఖపట్నానికి సొంతకారులో బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు సీతారాంపురం వద్దకు చేరుకుంది. వేగంగా వెళ్తూ రహదారి పక్కనే నిలిపి ఉన్న లారీని ఢీకొంది. దీంతో కారులో ఎడమ వైపు సీటులో కూర్చొన్న శ్రీనివాసరావు భార్య కోలా భారతి (44), కుమారుడు కోలా మోహన్‌ బాలాజీ (18) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మోహన్‌ బాలాజీ ఏయూలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. కారు నడుపుతున్న శ్రీనివాసరావు, ఆయన తల్లి వరలక్ష్మీ (70), సోదరి ధనలక్ష్మి (43), కుమార్తె స్ఫూర్తి (7) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి తుని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అప్పటివరకు పక్క సీటులో కూర్చుని కబుర్లు చెప్పిన భార్య, కుమారుడు కళ్లముందే కానరాని లోకాలకు తిరిగి వెళ్లిపోవడంతో శ్రీనివాసరావు బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై బాధితుని బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అప్పలరాజు, ఎస్సై జోగారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని