logo

ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయో తెలియదా..!

విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్ర

Published : 30 Mar 2023 04:33 IST

విద్యాశాఖ అధికారులపై ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆగ్రహం

అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశరావుపేటలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలకు వెళ్లినప్పుడు నగరంలో ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయని అధికారులను అడగ్గా సరైన సమాధానం రాకపోవడంతో..ఎన్ని ఉన్నాయో తెలియదా అని అసహనానికి గురయ్యారు. నాలుగో తరగతిలో ఉపాధ్యాయులు లేకపోవడంపై ఆరా తీయగా ఇంటర్‌ పరీక్షల ఇన్విజిలేషన్‌కు వెళ్లారని చెప్పడంతో సబ్జెక్టు టీచర్లను ఎందుకు పంపారని నిలదీశారు. క్వీన్‌మేరి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 38 మందిలో 22 మంది గణితం వర్కు బుక్‌లు తేలేదు. పాఠశాలలు తనిఖీ చేసే సమయంలో లోపాలను గుర్తించి సరిచేయాలని, ఆర్జేడీ స్థాయి అధికారి గుమస్తా మాదిరిగా విధులు నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నించారు. - కోటవీధిలోని పోర్టు బేసిన్‌ పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులకు ఒక్కరే ఉండగా వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వన్‌టౌన్‌ శివాలయం పక్కనే ఉన్న జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థుల్లో ఇద్దరు మాత్రమే ఒక సమస్యపై సరిగా రాశారు. మిగిలిన వారు రాయలేకపోయారు. బాధ్యుడైన ఉపాధ్యాయుడికి మెమో జారీ చేయాలన్నారు. విద్యాశాఖ అధికారులు జ్యోతికుమారి, చంద్రకళ, గౌరీశ్వరరావు, సువర్ణ, శ్రీనివాసరావు, మాణిక్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.  -  స్పృహతప్పిన ఉపాధ్యాయురాలు: తనిఖీల నేపథ్యంలో  క్వీన్‌మేరి ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు చింతా ఉమ ఒత్తిడికి గురై స్పృహ తప్పి పడిపోయారు. సహచర ఉపాధ్యాయులు ఆమెకు సపర్యలు చేయడంతో తేరుకున్నారు. ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆమెను పరామర్శించి ఒత్తిడికి గురి కావద్దన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని