logo

అనుమానాల పుట్ట!!

మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తరన్‌ సర్కార్స్‌) ప్రాంతంగా పేరున్న స్థలానికి  టీడీఆర్‌ (అభివృద్ధి బదలాయింపు హక్కు) బాండ్లు నిబంధనలకు విరుద్ధంగా

Published : 30 Mar 2023 04:33 IST

నిబంధనలకు విరుద్ధంగా ‘టీడీఆర్‌’ జారీ?!
జీవీఎంసీ అధికారుల మెడకు ఉచ్చు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

హా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తరన్‌ సర్కార్స్‌) ప్రాంతంగా పేరున్న స్థలానికి  టీడీఆర్‌ (అభివృద్ధి బదలాయింపు హక్కు) బాండ్లు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా బాండ్లను భవన నిర్మాణ అనుమతుల రుసుములకు వినియోగించుకోవడం గమనార్హం. ఈ టీడీఆర్‌ జారీ భవిష్యత్తులో జీవీఎంసీ అధికారుల మెడకు చుట్టుకునేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏకంగా రూ.63కోట్ల విలువైన టీడీఆర్‌ను కేవలం 18 రోజుల వ్యవధిలోనే జారీ చేసేశారు. ఇప్పుడు నిర్మాణదారు ప్లాను కోసం చేసిన దరఖాస్తులో స్థలానికి సంబంధించి టౌన్‌ సర్వేయర్‌ అభ్యంతరం తెలపడం చూసి కంగు తిన్నారు.  

విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టడానికి ఓ సంస్థ 2021లో ప్లాను కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తులో లోపాలున్నాయని జీవీఎంసీ పట్టణ ప్రణాళికాధికారులు గుర్తించారు. అయితే ఇవేమీ పరిశీలించకుండా టీడీఆర్‌ జారీ చేయడం ఇప్పుడు అధికారులను సమస్యల్లోకి నెడుతోంది.

ఆ స్థలం ఎలా వచ్చింది?..

టీడీఆర్‌ జారీ సందర్భంగా నిర్మాణదారుకు ఆ స్థలం చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం రెండు జీఓలు విడుదల చేసిందని ప్రణాళికాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం షార్ట్‌ఫాల్స్‌లో నిర్మాణదారుకు ఆ స్థలం ఎలా వచ్చిందో తెలియజేసే జీఓ కాపీలను పొందుపరచాలని పేర్కొనడం గమనార్హం. మరో పక్క 2041 మాస్టర్‌ ప్లాన్‌ రహదారి విస్తరణకు జీవీఎంసీకి గిఫ్ట్‌ డీడ్‌గా ఇచ్చిన స్థలం నిర్మాణదారులది కాదని టౌన్‌ సర్వేయరు నివేదిక ఇవ్వడం గమనార్హం.

మాస్టర్‌ప్లాన్‌ రహదారి విస్తరణలో ప్రస్తుత సీబీసీఎన్‌సీ భాగస్వామ్యులకు చెందిన స్థలం లేదని అందులో పేర్కొనడం కొసమెరుపు. అయితే అదే స్థలానికి జీవీఎంసీ అధికారులు టీడీఆర్‌ బాండ్లను జారీ చేశారు. నిర్మాణదారులు ఈ బాండ్లను ప్లాను దరఖాస్తు రుసుములకు వినియోగించేశారు. మరో పక్క ఎలాంటి ఆధారాలు (డాక్యుమెంట్లు)లేని 900 గజాల స్థలంలో నిర్మాణానికి ఎలా ప్లాను పెట్టారని సర్వేయర్‌ తన రిమార్స్క్‌లో రాశారు. 2041 మాస్టర్‌ ప్లానులో దక్షిణం వైపు రహదారి విస్తరణ ఉంటుందని ప్లాను డ్రాయింగ్‌లో చూపారని, వాస్తవంగా అటువైపు ఎలాంటి విస్తరణ లేదని సర్వేయర్‌ షార్ట్‌ఫాల్స్‌లో రాశారు.

అలా... ఎలా?..

జీఓ 345 ప్రకారం టీడీఆర్‌ రెండు రెట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ‘సీబీసీఎన్‌సీ’ ప్రాంత స్థలానికి ఇచ్చిన టీడీఆర్‌ కాపీలోనూ అదే జీఓను పొందుపరిచిన అధికారులు నాలుగు రెట్లు ఏ విధంగా ఇచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాస్తవంగా 2021లో టీడీఆర్‌లకు సంబంధించి జీఓ 136 ప్రకారం నాలుగు రెట్లు ఇవ్వవచ్చు. అదే విషయాన్ని టీడీఆర్‌ కాపీలో పొందుపరచాల్సి ఉంది. దాన్ని పొందు పరచాలంటే కచ్చితంగా డోర్‌ నెంబరు ఉండాలి. సీబీసీఎన్‌సీకి ఇచ్చిన టీడీఆర్‌లో డోర్‌ నెంబరు లేకపోవడం గమనార్హం.

రాష్ట్రంలో ఇప్పటి వరకు విడుదలైన టీడీఆర్‌ బాండ్లన్నింటిలోనూ డోర్‌ నెంబరు, ప్రాంతం, మార్కెట్ విలువ వంటి అంశాలు ఉన్నాయి. ఎలాంటి సమాచారం ఏదీ లేకపోయినా ఇక్కడ టీడీఆర్‌ జారీ చేశారు. వీటన్నింటిపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు