logo

ఏరువాకనూ ఎత్తుకెళ్లిపోతున్నారు!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఈ ప్రాంత రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఉద్యాన.

Updated : 31 Mar 2023 05:37 IST

రైతుకు సూచనలిస్తున్న ఏరువాక కేంద్రం  సమన్వయకర్త భవానీ

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఈ ప్రాంత రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నుంచి తరలించింది. ఇప్పుడు రెండు దశాబ్దాలుగా రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్న ఏరువాక కేంద్రాన్ని అమలాపురానికి తరలించేసింది. ఏప్రిల్‌ 1 నుంచి అనకాపల్లి స్థానిక పరిశోధన కేంద్రంలోని ఏరువాక కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతులకు క్షేత్రస్థాయిలో సూచనలిలిచ్చే శాస్త్రవేత్తలు ఇకపై అందుబాటులో ఉండరు.
అనకాపల్లి పరిశోధన కేంద్రానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేస్తుంటారు. వీరు చేస్తున్న పరిశోధనలు సాగుదారులకు పూర్తి స్థాయిలో చేరడం లేదు. రైతులు నేరుగా పరిశోధనా స్థానానికి రావడం తక్కువ. అందుకే శాస్త్రవేత్తలనే నేరుగా పంటపొలాల వద్దకు పంపాలనే లక్ష్యంతో ఇక్కడ 2003లో ఏరువాక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

గ్రామాల్లో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల ప్రచారం (పాత చిత్రం)

ఇందుకోసం పరిశోధన కేంద్రం ఆవరణలోనే ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో పని చేసేందుకు ముగ్గురు శాస్త్రవేత్తలను నియమించారు. జిల్లా అంతటా తిరిగేందుకు వాహన సదుపాయం కల్పించారు. వీరు గ్రామాల్లో పర్యటిస్తూ పరిశోధన స్థానంలో నూతనంగా రూపొందించే కొత్త వంగడాలను వివరించడం, పరిశోధన ఫలితాలను రైతులకు చేరవేయడం చేస్తుండేవారు. పంటలకు ఏమైనా చీడపీడలు సోకితే నేరుగా వాటిని పరిశీలించి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించేవారు. వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సాగుదారులకు సూచనలు అందించేవారు. గ్రామాల్లోని ఆదర్శ రైతులను గుర్తించి వారి భూముల్లో నూతన వంగడాలను వేయించేవారు. దీనివల్ల సమీపంలోని రైతులంతా వాటిని స్వయంగా చూసి వారి కమతాల్లోనూ సాగు చేసేందుకు ఆసక్తి చూసేవారు. అన్నదాతలకు నేరుగా సెల్‌ ఫోన్‌లలో సమాచారం అందించేందుకు  నూతనంగా యాప్‌లను ఏరువాక శాస్త్రవేత్తలు రూపొందించారు. ఏరువాక కేంద్రం ఉన్నందున ముఖ్యంగా తుపాన్లు, కరవు వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సకాలంలో రైతులకు సూచనలు, సలహాలు అందిస్తూ పంట నష్టాలను చాలావరకు తగ్గించగలిగారు. ఇకపై ఏరువాక కేంద్రాన్ని పూర్తిగా మూసి వేసినందున పరిశోధన ఫలితాలు తమకు అందడం కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్కగా పనిచేస్తున్న కేంద్రాన్ని ఇక్కడ నుంచి తరలించడం పట్ల పలు రైతు సంఘాలు ఆందోలన వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని