logo

డీ పట్టా నిబంధనతో.. డీలా!!

పట్టణ భూగరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోపై నగరంలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

Published : 31 Mar 2023 04:23 IST

‘యూఎల్‌సీ’ భూముల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై ఆవేదన
ఈనాడు, విశాఖపట్నం

పట్టణ భూగరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోపై నగరంలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

భూముల్లో ఇళ్లు కట్టుకొని తరాలుగా నివశిస్తున్నామని, ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసినా పదేళ్ల వరకు అమ్ముకునే హక్కు ఉండదంటే ఎలా అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సొంతిళ్లని ధీమాగా ఉంటే డీపట్టా ఇచ్చి ఎటువంటి విలువ లేకుండా చేస్తారనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిని ఆర్థిక అవసరాలకు వినియోగించుకునే వీలు లేకుండా చేస్తే తమ పరిస్థితి మరింత దయనీయమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరా తీసి...

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జనవరి 31న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయా ప్రాంతాల్లో మార్కెట్‌ విలువకు రెండింతలు డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకతవ్యక్తమైంది. అధికార పార్టీకి చెందిన నాయకులు సైతం వ్యతిరేకించారు. ఆ జీవోకు కొన్ని సవరణలు చేసి తాజాగా ఫిబ్రవరి 24న ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. సమాచారం తెలుసుకున్న కొందరు తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్తున్నారు. అధికారులను కలిసి వివరాలు తెలుసుకొని తిరిగొచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు సీతమ్మధార, చినగదిలి, గోపాలపట్నం, ఇతర మండల కార్యాలయాలకు ఎటువంటి దరఖాస్తులు అందలేదు. దరఖాస్తు చేసుకునేందుకు కొందరు వెళ్లినా డీపట్టా ఇస్తామని చెబుతుండటంతో ఆసక్తి చూపడం లేదు.

150 గజాల్లోపు ఉచితమైనా..: కొత్త ఉత్తర్వుల ప్రకారం 150 చదరపు గజాల్లోని నిర్మాణాలకు ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదు. ఉచితంగానే పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నగరంలో వంద గజాల్లోపు ఇళ్ల స్థలాలే అధికం. 100 నుంచి 150 గజాల మధ్య ఉన్నవీ ఎక్కువే. అయినప్పటికీ ఎవరూ దరఖాస్తుకు ముందుకు రావడం లేదు. సీతంపేట, గణేష్‌నగర్‌, రేసపువానిపాలెం, మాధవధార, లలితానగర్‌, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లో అటువంటి నిర్మాణాలు ఉన్నా చాలా మంది ముందుకు రావడం లేదు. 150 గజాల నుంచి 300 గజాల వరకు ప్రాథమిక విలువలో 15 శాతం, 300- 500 గజాల వరకు 30 శాతం, 500 గజాల కన్నా ఎక్కువ ఉంటే వంద శాతం చెల్లించేలా ఉత్తర్వులు రాగా ఏ కేటగిరీలో ఉన్నవారు కూడా స్పందించడం లేదు.

రెండు, మూడు రిజిస్ట్రేషన్లు జరగడంతో: ‘యూఎల్‌సీ’ భూముల ఆక్రమణదారులెవరూ చాలా చోట్ల అక్కడ లేరు. ఇతరులకు విక్రయించేశారు. ఇప్పటికే పలువురి చేతుల్లోకి మారి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అటువంటి వారు దరఖాస్తు చేయడానికి అసలు ఆసక్తి చూపడం లేదు. గాజువాక, సీతంపేట, లలితా   నగర్‌, పెదగంట్యాడ, ములగాడ, పెందుర్తి, గోపాలపట్నం, విశాఖ గ్రామీణం, మహారాణిపేట , మాధవధార, కేఆర్‌ఎం కాలనీ, మురళీనగర్‌, సీతమ్మధార, రేసపువానిపాలెంలోని యూఎల్‌సీ భూముల్లో ఆక్రమణలు ఉన్నాయి.  వీటిలో దాదాపు 3,800 నిర్మాణాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని