logo

బొమ్మల పేరిట భారీ దోపిడీ

జి-20 సన్నాహక సదస్సుల పేరిట జీవీఎంసీ అధికారులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Published : 31 Mar 2023 04:23 IST

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌

బొమ్మలను చూపుతున్న కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : జి-20 సన్నాహక సదస్సుల పేరిట జీవీఎంసీ అధికారులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. గురువారం ఉదయం తెన్నేటి పార్కు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.‘జి-20కి సంబంధించి జీవీఎంసీ అధికారులకు ముందస్తు సమాచారం ఉన్నా షార్ట్‌ టెండర్ల పేరిట రూ.కోట్లను దుర్వినియోగం చేశారు. తెన్నేటిపార్కు వద్ద బొమ్మల చిత్రీకరణకు భారీగా వ్యయం చేశారు. ఇందులో అక్రమాలు జరిగాయి. సదస్సుకు 57 మంది మాత్రమే పాల్గొనగా రూ.150 కోట్ల మేర పనులను కేవలం బీచ్‌రోడ్డు, అతిథులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మాత్రమే చేపట్టారు. భారీగా దుర్వినియోగం చేశారు. రూ.10 ఖర్చయ్యే పనికి వెయ్యి రూపాయలు చూపించారు. కౌన్సిల్‌లో చర్చించకుండా ఈ దుబారా చేశారు. మురికివాడలు కనిపించకుండా పరదాలు కప్పి.. ఆ ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన 40 శాతం నిధులను లూటీ చేశారు. గతంలో ఐఎఫ్‌ఆర్‌కు రూ.80 కోట్లను ఖర్చు చేయగా, అవినీతి జరిగిందంటూ వైకాపా నాయకులు ఆరోపించారు. ఇప్పుడు రూ.150 కోట్లలో అవినీతి జరిగితే ఎందుకు ప్రశ్నించటంలేదు?. నాణ్యత లేకుండా చేపట్టిన పనులు, పనులు జరగకుండా బిల్లులు మంజూరు అంశంపై మిగిలిన కార్పొరేటర్లతో చర్చించి పోరాటం చేస్తాం. ఇటీవల జరిగిన జీఐఎస్‌ సదస్సుకు, ఇప్పుడు జరిగిన ‘జి-20’ సదస్సుకు విశాఖ ప్రథమ పౌరురాలు మేయర్‌ హరివెంకటకుమారిని ఎందుకు ఆహ్వానించలేదు. ‘జి-20’ సదస్సు ఏర్పాటుచేసిన జీవీఎంసీ అధికారులను కూడా ప్రాంగణంలోకి అనుమతించకపోవటం గమనార్హం. సదస్సు పేరిట జరిగిన అవినీతిపై ఏసీబీ ద్వారా విచారణ జరపాలి’ అన్నారు.  కార్యక్రమంలో జనసేన నాయకులు రూప, పి.శ్రీణు, రవికుమార్‌, చిన్నబాబు, పీతల రాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని