logo

ఇంటింటికీ ఇస్తుంటే ఇన్ని కష్టాలా?

ప్రజాపంపిణీ దుకాణాలకు వెళ్లనవసరం లేకుండా మొబైల్‌ వాహనాల ద్వారా రెండేళ్ల నుంచి రేషన్‌ సరుకులు అందిస్తున్నారు. ఈ వాహనాలు నడిపే ఆపరేటర్లకు నెలకు రూ.21 వేలు వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.

Published : 31 Mar 2023 04:23 IST

జీతాల్లేవ్‌.. కమీషన్‌ తేల్చరు..
ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన
ఈనాడు డిజిటల్‌, పాడేరు

ప్రజాపంపిణీ దుకాణాలకు వెళ్లనవసరం లేకుండా మొబైల్‌ వాహనాల ద్వారా రెండేళ్ల నుంచి రేషన్‌ సరుకులు అందిస్తున్నారు. ఈ వాహనాలు నడిపే ఆపరేటర్లకు నెలకు రూ.21 వేలు వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఈ మొత్తంలో కొంత బ్యాంకు వాయిదాతో పాటు ఇంధనం, సహాయకుని ఛార్జీలకు వినియోగించాల్సి ఉంటుంది. మిగతా సొమ్ముతో జీవనోపాధి పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్రమంగా వీరిపై పని ఒత్తిడి పెంచారు.

వాహనాలకు బ్యాంకులే బీమా ప్రీమియం చెల్లిస్తాయన్నారు.. తర్వాత ఆపరేటర్లే బీమా భారం భరించాలన్నారు. వీటికి తోడు నెలవారీ ప్రభుత్వం విడుదల చేస్తున్న వేతనాలు ఖాతాల్లో పడినా ఆపరేటర్ల చేతికి సక్రమంగా అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.


గత రెండు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం బళ్లు నడపలేమని తమ సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్‌ 1 నుంచి వాహనాలు నిలిపేసి నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు.


రావికమతం తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న ఆపరేటర్లు

అనకాపల్లి జిల్లాలో 374, అల్లూరి జిల్లాలో 221 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) వాహనాలున్నాయి. వీటి ద్వారా ఆపరేటర్‌తో పాటు బియ్యం తూకం వేసే సహాయకుడు ఒకరు ఉపాధి పొందుతున్నారు. వీరు ప్రతినెలా 1 నుంచి 17 వరకు 12.28 లక్షల మంది ఇళ్లకు రేషన్‌ సరకులు చేరవేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.21 వేలు జీతంగా ఇస్తోంది. ఇందులో రూ.3 వేలు వాహన రుణంగా బ్యాంకు మినహాయించుకుంటుంది. రూ.18 వేలు ఆపరేటర్‌ చేతికి అందుతున్నాయి. వాహన ఇంధనానికి, సహాయకునికి కలిపి సుమారు రూ.8 వేల వరకు ఖర్చవుతున్నాయి. కొన్నినెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యం, కందిపప్పును చేరవేసే బాధ్యతను వీరికే అప్పగించారు. దీనికోసం కమీషన్‌ రూపంలో అదనపు భత్యం చెల్లిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అయిదు నెలలు గడిచినా వాటికి సంబంధించి ఒక్కపైసా కూడా ఆపరేటర్లకు అందలేదు.


త రెండు నెలలుగా వీరి ఖాతాల్లో జీతాలు పడుతున్నా బ్యాంకులు అప్పుగా పూర్తి మొత్తం మినహాయించుకుంటున్నాయి. ఆ ఖాతాల్లో వ్యక్తిగతంగా దాచుకున్న సొమ్మును కూడా తీసుకోవడానికి అడ్డుపడుతున్నాయి. వాహన మిత్రగా రూ.10 వేలు ఇస్తాం, వాటిని బీమాగా చెల్లించేయండని అధికారులు ఉచిత సలహా ఇచ్చారని, కనీసం ఆ ఆర్థిక సాయం కూడా ఇప్పటి వరకు అందించలేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అప్పులు చేసి వాహనాలను తిప్పాల్సి వస్తోందని, తమ సమస్యలకు ఈనెల 31లోగా పరిష్కారం చూపకుంటే బియ్యం బళ్లు కదిలే ప్రసక్తి లేదంటున్నారు.


అదనపు భారం పడుతోంది..

- రీమాల పాల్‌, ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, గూడెంకొత్తవీధి మండలం

మా వాహనాలకు సకాలంలో సరకులు అందించడం లేదు.. అరకొర నిల్వలతో వెళ్లిన గ్రామానికే రెండుసార్లు తిరగాల్సి వస్తోంది. పెట్రోల్‌పై అదనంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఐసీడీఎస్‌, ఎండీఎంకు సరఫరా చేయడం కష్టంగానే ఉంది. బీమా చెల్లించడం లేదనే సాకుతో రెండు నెలల నుంచి జీతాలు నిలిపేశారు. హమాలీలకు కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. సమస్యలు గురించి చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర సంఘం సూచనల మేరకు బళ్లు నిలిపేయబోతున్నాం.


ఒప్పందానికి వ్యతిరేకం..

-వెంకట ఉమామహేశ్వరరావు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, రావికమతం మండలం

మాకు ఎండీయూ వాహనాలు ఇచ్చేటప్పుడు కొన్ని ఒప్పందాలపై సంతకాలు తీసుకున్నారు. వాటికి విరుద్ధంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. బీమా ప్రీమియం, ఐసీడీఎస్‌, ఎండీఎం బియ్యం సరఫరాకు సంబంధించి అందించాల్సిన ప్రోత్సాహకాల విషయంలో స్పష్టత రావడం లేదు. రెండు నెలలుగా ప్రభుత్వం డబ్బులిస్తున్నా బ్యాంకులు అడ్డుకుంటున్నాయి. ఖాతాల్లో మైనస్‌ నిల్వలు చూపిస్తున్నారు. సక్రమంగా వేతనాలందక విధిలేని పరిస్థితుల్లోనే వాహనాలు నిలిపేస్తున్నాం.


రేషన్‌ పంపిణీకి ఇబ్బంది

- కళ్యాణి, ఇన్‌ఛార్జి డీఎస్వో

రానివ్వం: ఎండీయూ ఆపరేటర్ల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నాయి. కమీషన్‌ డబ్బులు త్వరలో వస్తాయి. వాహన మిత్రగా రూ.10 వేల చొప్పున ఖాతాల్లో వేశారు. వాటితో బీమా ప్రీమియం చెల్లించుకోవచ్చు.  ఏప్రిల్‌ మొదటి వారంలో బ్యాంకు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. రేషన్‌ పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారితో మాట్లాడతాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని