logo

సిమెంటు బస్తాలు ఏమయ్యాయి?

మరుపాక పంచాయతీలో అభివృద్ధి పనుల పేరుతో సిమెంటు, రూ.లక్షల్లో నిధులను పక్కదారి పట్టించడంపై గ్రామస్థులు గురువారం జరిగిన సామాజిక తనిఖీ గ్రామ సభలో అధికారులను నిలదీశారు.

Published : 31 Mar 2023 04:23 IST

సామాజిక తనిఖీ గ్రామసభలో గ్రామస్థుల నిలదీత

గ్రామసభలో ప్రశ్నిస్తున్న గ్రామస్థులు

రావికమతం, న్యూస్‌టుడే: మరుపాక పంచాయతీలో అభివృద్ధి పనుల పేరుతో సిమెంటు, రూ.లక్షల్లో నిధులను పక్కదారి పట్టించడంపై గ్రామస్థులు గురువారం జరిగిన సామాజిక తనిఖీ గ్రామ సభలో అధికారులను నిలదీశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిన దాఖలాల్లేవు. 1200 సిమెంటు బస్తాలు, రూ.4.6 లక్షల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2021-22 సంవత్సరానికి మరుపాక పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద 37 పనులు, మినీ గోకులం షెడ్లు-3, ఫారెస్టు-3, విద్యాశాఖ-2, పంచాయతీరాజ్‌-4, గ్రామ సచివాలయం-1 తదితర నిర్మాణ పనులకు రూ.83.95 లక్షలు విడుదలయ్యాయని డీఆర్‌పీ రాజు చెప్పారు. మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి 1,200 సిమెంటు బస్తాలు వచ్చాయని చెప్పగా.. ‘అవి ఎక్కడున్నాయో, ఏమయ్యాయో తేలియదు. పనులు చూస్తే ఎక్కడా జరగలేదు. సిమెంటు బస్తాలకు లెక్కలు చెప్పాల’ని గ్రామస్థులు డిమాండు చేశారు. 540 బస్తాలకే రికార్డులు ఉన్నాయి, మిగతా వాటికి లెక్కల్లేవని, రికార్డుల్లో నమోదు కాలేదని డీఆర్‌పీ పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చిన సిమెంటు బస్తాలను తట్టబంద, గొంప పంచాయతీలకు పంపినట్లు పీఆర్‌ ఏఈ చెప్పగా.. మా గ్రామానికి వచ్చిన సిమెంటును పక్క గ్రామాలకు ఎలా ఇస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ, పసుపులేటి వీధుల్లో సిమెంటు కాలువలు నిర్మించలేదని, మట్టి కాలువలు తవ్వి వదిలేశారన్నారు. సీసీ కాలువలు నిర్మించినట్లు చూపి రూ.4.6 లక్షల వరకు బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. గోకులం షెడ్లు మూడు మంజూరు కాగా వాటిని నిర్మించకుండానే నిధులు వాడేశారని, అవి ఎవరి పేరున వచ్చాయో కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. పంచాయతీలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు పక్కదారి పట్టలేదని, పనులు చేసిన మేరకే బిల్లులు డ్రా చేసినట్లు సర్పంచి లావణ్య పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యుడు సూర్యనారాయణ, వీఆర్‌పీ శానాపతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని