logo

త్వరలో రాజధానిగా విశాఖ

విశాఖలో రాజధాని త్వరలో ఏర్పాటు అవుతుందని, ముఖ్యమంత్రి జగన్‌ ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.

Published : 01 Apr 2023 07:02 IST

ఎలమంచిలి, నక్కపల్లి, న్యూస్‌టుడే: విశాఖలో రాజధాని త్వరలో ఏర్పాటు అవుతుందని, ముఖ్యమంత్రి జగన్‌ ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి, నక్కపల్లి బాలికల గురుకుల పాఠశాలలను శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. పాఠశాల ఆవరణలో వసతులు తనిఖీ చేశారు. విద్యార్థులతో, కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. గురుకుల పాఠశాలల కోసం ముఖ్యమంత్రి జగన్‌ రూ. కోట్ల నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాలల వసతిగృహాల కంటే ఇక్కడ చక్కని సౌకర్యాలు ఉన్నాయన్నారు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు. తాము చదువుకునే రోజుల్లో ఇన్ని సదుపాయాలు లేవన్నారు. ఇంటర్‌ వరకు ఇక్కడే విద్య అందుతుండగా, ఆ తర్వాత పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి పంపుతున్నామని, క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లోనూ ప్రతిభ చూపి ఉద్యోగాలు సాధిస్తున్న వారుకూడా ఉన్నారని చెప్పారు.  నాడు-నేడు పనులు చాలా బాగా చేశారన్నారు. ఇప్పటికే పనులు జరిగిన చోట్ల ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటినీ పరిష్కరిస్తున్నారని చెప్పారు. నక్కపల్లి గురుకులంలో మరుగుదొడ్లు, డైనింగ్‌ హాల్‌ కావాలని కోరారని, వీటి పనులు చేయిస్తామన్నారు. బాలికలు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలసి మెస్‌లో భోజనాలు చేశారు. వంటకాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. పదోతరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. గురుకులాల జిల్లా సమన్వయకర్త ఎస్‌.రూపాదేవి, ప్రిన్సిపల్స్‌ కృష్ణతార, శారద, తహసీల్దార్లు నీరజ, రాణి అమ్మాజీ, ఎంపీపీలు బోదెపు గోవింద్‌, రత్నం, వైకాపా నాయకులు బొద్దపు ఎర్రయ్యదొర, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు ఆరెపు గుప్తా, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి, సంతోష్‌, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, సర్పంచులు జయరత్నకుమారి, సాదిరెడ్డి శ్రీను, ఎంపీడీఓ సీతారామరాజు తదితరులు మంత్రిని సత్కరించారు. ఎస్సీ కాలనీవాసులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని సూర్య, లోవరాజు వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు రెవెన్యూ కార్యాలయం సమీపంలోని ఎస్సీ కార్పొరేషన్‌ స్థలాన్ని మంత్రి నాగార్జున పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని