logo

పట్టణవాసి దాహార్తి తీరేదెన్నడు?

నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాలకు ఉద్దేశించి రూ.వందల కోట్ల అంచనా విలువతో  చేపట్టిన మెగాతాగునీటి పథకాల పనుల్లో ముందడుగు పడడం లేదు.

Updated : 01 Apr 2023 08:05 IST

నత్తనడకన మెగా తాగునీటి ప్రాజెక్టు పనులు

నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాలకు ఉద్దేశించి రూ.వందల కోట్ల అంచనా విలువతో  చేపట్టిన మెగా
తాగునీటి పథకాల పనుల్లో ముందడుగు పడడం లేదు.

విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఏడో జోన్‌గా ఉన్న అనకాపల్లి పట్టణవాసుల కోసం  ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన శుద్ధజలం ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు. నిధుల కొరత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, శాఖల మధ్య సమన్వయ లోపం
పట్టణ ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి.  

జిల్లాలో పట్టణ జనాభా అంతకంతకూ పెరుగుతోంది. వచ్చే 20 ఏళ్లలో పెరగనున్న జనాభాను అంచనా వేసి తలసరి 135 లీటర్ల తాగునీటి సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ అర్భన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సెఫ్టేజ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (ఏపీయూడబ్ల్యూఎస్‌ఎస్‌ఎంఐపీ), ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) నిధుల నుంచి సమగ్రనీటి సరఫరా పథకాలకు గత ప్రభుత్వంలోనే రూపకల్పన జరిగింది. వైకాపా సర్కారు కొలువుతీరిన మొదట్లో వీటి గురించి పట్టించుకోలేదు..తర్వాత కొవిడ్‌ కారణంగా రెండేళ్లు వీటిని జోలికి పోలేదు. గతేడాది నుంచి చేయాల్సిన పనులపైనా చిత్తశుద్ధి చూపడం లేదు. దీంతో కొత్త పథకాలు అందుబాటులోకి రాక..పాత పథకాలతో సర్దుబాటు చేయాల్సిరావడంతో పట్టణ వాసుల గొంతు తడపలేకపోతున్నారు.

ఎలమంచిలి పట్టణంలో చాలా కాలంగా వృథాగా పడి ఉన్న పైపులు

అంచనాలే పెరిగాయి..

నర్సీపట్నంలోని 28 వార్డుల్లో 16,168 గృహాలున్నాయి. వీటికి ప్రస్తుతం వరహా నది నుంచి 12 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాల్సి ఉంది. 4.06 ఎంఎల్‌డీ మాత్రమే అందించగలుగుతున్నారు. లోటును భర్తీచేయడంతో పాటు 2048 నాటికి పెరగనున్న జనాభాకు 16.70 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఏలేరు కాలువ నుంచి యండవల్లి వద్ద ఆఫ్‌టెక్‌ యూనిట్‌ నిర్మించి అక్కడి నుంచి పైప్‌లైన్లు ద్వారా సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుకు నీటిని మళ్లించి పురవాసులకు సురక్షిత నీటిని అందించాలని డిజైన్‌ చేశారు. దీనికోసం మొదట రూ.142.76 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

పనుల్లో జాప్యం కారణంగా 2020 వచ్చేనాటికి రూ.166.89 కోట్లకు ఆ వ్యయం పెరిగిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయా పనులు మాత్రం ముందుకువెళ్లడం లేదు. నర్సీపట్నంలో 1560 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో సమ్మర్‌ స్టోరేజి నిర్మించాల్సి ఉంది. జలవనరుల శాఖ పరిధిలోని పెద్దచెరువు దీనికి అనుకూలంగా ఉన్నా ఆ తటాకం కింద ఆయకట్టుదారుల సమ్మతి లేఖను సంబంధిత శాఖకు ఇవ్వలేకపోయారు. 18 కి.మీ పొడవునా ప్రధాన పైపులైన్‌ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు నాలుగు కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. నీటి సరఫరా కోసం 120 కి.మీ మేర పైపులైన్ల వేయాల్సి ఉంటే 65 కి.మీ వరకు వేశారు. వీటి పనులు చూస్తుంటే మరో మూడళ్లయినా పట్టణవాసులకు తాగునీరందించే పరిస్థితి కనిపించడం లేదు.

‘సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటుకు రెవెన్యూ, జలవనరులశాఖ నుంచి అనుమతి కోసం చూస్తున్నాం. అవి రాగానే పనులు మొదలు పెడతాం. ఏలేరు నీటిని తీసుకోవడానికి అనుమతి రావడంతో యండపల్లి వద్ద పనులకు సన్నాహాలు చేస్తున్నాం.’ అని ప్రజారోగ్యశాఖ డీఈ మహేష్‌ వివరించారు

ఎలమంచిలిలో ఎడతెగని జాప్యం..

ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 52,219 మంది జనాభా ఉన్నారు. 12,067 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి రోజుకి 135 లీటర్ల నీటిని అందించాలన్న లక్ష్యంతో రూ.101.71 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టు చేపట్టారు. రెండు ప్యాకేజీలుగా గుత్తేదారు సంస్థలకు అప్పగించారు.

గొల్లలకొండ, శేషుకొండ, పెదగొల్లలపాలెం, కొత్తపాలెం, రామారాయుడుపాలెం, కొక్కిరాపల్లి, తెరువుపల్లి, సోమలింగపాలెంలలో ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో స్థలాలను పురపాలకశాఖ అప్పగింతలో జాప్యం జరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది గ్రామాల్లో రోడ్లు తవ్వి పైపులైన్లు వేస్తున్నారు. ఈ సమయంలో పాత పైపులైన్లు దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. ‘ఈ పనులు ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.. సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టిలో పెడుతున్నట్లు ’ఈఈ రాయల్‌బాబు చెప్పారు.

అసంపూర్తిగానే శుద్ధజల సరఫరా..

జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, భీమిలి జోన్‌లకు మిగతాజోన్లన్నింటికీ శుద్ధజలం సరఫరా చేస్తున్నారు. 2019లో అగనంపూడి వద్ద ఏలేరు కాలువ నీటిని శుద్ధిచేసి అనకాపల్లి జోన్‌కు సరఫరా చేయడానికి ముఖ్యమంత్రి రూ.32 కోట్లతో శంకుస్థాపన చేశారు..వీటి పనులను కొంతవరకు చేపట్టారు. జాతీయ రహదారి పక్కగా తవ్వి పైపులైన్లు వేశారు..వీటికి సంబంధించి బిల్లులు అందకపోవడంతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారు..మూడేళ్లు గడిచినా శుద్ధజలాన్ని అనకాపల్లికి అందించలేకపోవడం విశేషం. ‘జాతీయ రహదారికి కొంత పరిహారం చెల్లించాల్సి రావడంతో పనులు ఆగాయి..ఇటీవల వారికి రూ.78 లక్షలు చెల్లించాం.. త్వరలో పైప్‌లైన్‌ పనులు పునరుద్ధరించి వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటాం’ అని ప్రాజెక్టు ఏఈ రవి తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు