logo

Visakhapatnam Port: సరకు రవాణాలో సరికొత్త చరిత్ర

‘విశాఖపట్నం పోర్టు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73.75 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా (కార్గో హ్యాండ్లింగ్‌) చేసింది. పోర్టు చరిత్రలో ఇది అతిపెద్ద రికార్డు’ అని ఛైర్మన్‌ కె.రామ్మోహనరావు పేర్కొన్నారు.

Updated : 01 Apr 2023 08:30 IST

విశాఖ పోర్టు ట్రస్ట్‌ ఛైర్మన్‌ రామ్మోహనరావు
ఈనాడు-విశాఖపట్నం

సమావేశంలో మాట్లాడుతున్న పోర్టు ట్రస్ట్‌ ఛైర్మన్‌ రామ్మోహనరావు

‘విశాఖపట్నం పోర్టు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73.75 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా (కార్గో హ్యాండ్లింగ్‌) చేసింది. పోర్టు చరిత్రలో ఇది అతిపెద్ద రికార్డు’ అని ఛైర్మన్‌ కె.రామ్మోహనరావు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ప్రధాన పోర్టులలో నాల్గవ స్థానంలో, తూర్పు తీరంలో రెండో స్థానంలో విశాఖ పోర్టు నిలిచిందన్నారు. ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన ట్రాఫిక్‌ మేనేజర్‌ రత్నశేఖర్‌, డిప్యూటీ ఛైర్మన్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అక్కయ్యపాలెంలోని పోర్టు కళావాణి సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
* 2021-22తో పోల్చితే 2022-23లో స్టీమ్‌ కోల్‌ 67%, క్రూడ్‌ ఆయిల్‌ 13%, బొగ్గు 11%, ఎరువులు 6% రవాణా పెరిగిందని, థర్మల్‌ కోల్‌ 57 శాతం, ఇనుప ఖనిజం   0.2%, కంటైనర్ల రవాణా 2% తగ్గాయన్నారు. 2019లో కార్గో రవాణా 65 మిలియన్ల టన్నులు ఉండగా, ప్రస్తుతం 73 మిలియన్ల టన్నులకు తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు  ఛైర్మన్‌ తెలిపారు. గతంలో ఇన్నర్‌ హార్బర్‌లోకి పెద్ద నౌకలు వచ్చేవి కాదని, ప్రస్తుతం 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు ఉన్న బేబీ కేప్‌ వెసెల్‌ తీసుకొచ్చి సరకు రవాణా పెంచామన్నారు. రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన 6వ నెంబరు బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురాగా, 1.5 మిలియన్‌ కార్గో రవాణాతో రూ.65కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. అదానీ బెర్త్‌లోనూ(ఈక్యూ1) చాలా కాలం ఆపరేషన్‌ లేకుండా ఉండగా, ప్రస్తుతం రూ.54 కోట్లు ఆదాయం సాధించామన్నారు.

అది లీజు మాత్రమే..

‘పోర్టుకు 7,500 ఎకరాల భూములున్నాయి. వీటిలో చాలా వరకూ నిరుపయోగంగా ఉన్న వాటిని గుర్తించి పబ్లిక్‌ ప్రైవేటు పద్ధతిలో లీజుకిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నాం. సాలిగ్రామపురంలోని ఆసుపత్రి పక్కన ఉన్న  భూములను పీపీపీ విధానంలో 30 ఏళ్లకు లీజుకివ్వగా రూ.125 కోట్లు చెల్లించారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో వడ్డీల రూపంలో ఏడాదికి రూ.10కోట్లు వస్తుంది.  లీజుకిచ్చిన స్థలాల్లో ఏర్పాటు చేసే మాల్స్‌, ఇతరత్రా వల్ల విశాఖలో పది వేల మందికి ఉపాధి దక్కుతుంది’ అన్నారు.

కాలుష్యం తగ్గేలా..

‘గత మూడున్నరేళ్లలో పోర్టు పరిధిలో కాలుష్యం చాలా వరకు తగ్గింది. మెకానికల్‌ డస్ట్‌ సప్రెషన్‌ సిస్టమ్‌ (దుమ్ము అణిచివేసే యాంత్రిక పద్ధతి) పాటిస్తూ కాలుష్యం నియంత్రిస్తున్నాం. రూ.150-200 కోట్లతో కవర్డ్‌ షెడ్లు నిర్మిస్తున్నాం. మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ బొగ్గు, ఇనుప ఖనిజం  15లక్షల టన్నులు నిల్వ చేస్తాం. రూ.288 కోట్లతో వెస్ట్‌ క్యూ 7, 8లను రెండు కంపెనీలకు కేటాయించి ఒప్పందం చేసుకుంటున్నాం. బహిరంగ ప్రదేశాల్లో బొగ్గు వేరు చేయకుండా యంత్రాలతో చేసే విధానం తీసుకొచ్చాం.
* ఈక్యూ-7ను సైతం 30 ఏళ్లకు పీపీపీ విధానంలో రూ.200 కోట్లకు లీజుకిచ్చాం. ఐదారేళ్లలో పోర్టు అంతా కవర్డ్‌ స్టోరేజీలా మార్చాలని నిర్ణయించాం. గతేడాది పోర్టు ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటగా, ఈ ఏడాది 20-30వేల మొక్కలు నాటుతాం. విశాఖ పోర్టును ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి డ్రైనేజీ కాల్వలు, రోడ్లు, డిజిటలైజేషన్‌ ఉండేలా చూస్తున్నాం.  కేంద్ర నిధులు రూ. 150 కోట్లతో ఆధునికీకరణ చేస్తున్నాం’ అని వివరించారు. కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ ఛైర్మన్‌ దుర్గేష్‌ కుమార్‌ దూబే, సీఈవో పీఎస్‌ఎల్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు