logo

Visakhapatnam: ఏసీ బోగీల్లో నరక యాతన.. తరచూ ఎందుకీ సమస్య?

రైళ్లలోని శీతల బోగీలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తరచూ ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో  నరకయాతన అనుభవిస్తున్నారు.

Updated : 20 May 2023 10:06 IST

తరచూ పనిచేయని శీతల యంత్రాలు

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: రైళ్లలోని శీతల బోగీలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తరచూ ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో  నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ పరిస్థితి తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో విశాఖ స్టేషన్‌లో రెండు గంటల పాటు రైలును నిలిపేశారు. సమస్య తలెత్తిన బోగీని యార్డుకు తీసుకెళ్లి మరమ్మతులు చేయించి పంపారు. శుక్రవారం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ఏసీలు పనిచేయక ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. ఎలమంచిలి స్టేషన్‌లో రైలును ఆపి ఆందోళనకు దిగారు. తరచూ ఏసీ బోగీల్లో శీతలయంత్రాలు పనిచేయడం లేదని రైల్వే అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి.

తరచూ ఎందుకీ సమస్య: ఇటీవల రైల్వేబోర్డు పలు రైళ్లలో జనరల్‌, స్లీపర్‌ బోగీలను తగ్గించి శీతల(ఏసీ) బోగీలను పెంచింది. ఎల్‌హెచ్‌బీ బోగీలుగా మార్చిన తర్వాత విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో కేవలం మూడు స్లీపర్‌ బోగీలు మిగిలాయి. ఏసీ బోగీలు 14కు చేరుకున్నాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 5 స్లీపర్‌ బోగీలు ఉండగా, ఏసీ బోగీలు 11 ఉన్నాయి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో 9 ఏసీ బోగీలు ఉండగా, 7 స్లీపర్‌ బోగీలు ఉన్నాయి. గతంలో ఐసీఎఫ్‌ ర్యాక్‌లు ఉన్నప్పుడు ఏసీ బోగీల కోసం పవర్‌ బ్యాటరీలను ఉపయోగించేవారు. ఎల్‌హెచ్‌బీలుగా మారిన తర్వాత బ్యాటరీలను తొలగించారు. ఇంజిన్‌ సామర్థ్యంతో ఏసీ బోగీలు నడుస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రైలింజిన్‌ వేగంగా నడుస్తున్నప్పుడే ఏసీలు పనిచేస్తున్నాయని, ఎక్కడైనా పది నిమిషాలు ఆగిందంటే పనిచేయడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఐసీఎఫ్‌ ర్యాక్‌లు ఉన్న గరీబ్‌రథ్‌ తదితర రైళ్లలో ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.

ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు..

ఆధునికీకరణ ఆలోచనలో ఉన్న రైల్వే ఇప్పటికే అధికశాతం రైళ్లను ఎల్‌హెచ్‌బీ ర్యాక్‌లుగా మార్పు చేసింది. దీంతో ఆయా రైళ్లలో సాధారణ బోగీలు తగ్గిపోయి..ఏసీ బోగీలు రెట్టింపయ్యాయి. పవర్‌కార్‌ బోగీలు ఉంటే ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తాయి. ప్రస్తుతం అధికశాతం రైళ్లలో ఒకటే పవర్‌కారు బోగీ ఉంచారని సమాచారం. ఏసీలు సరిగా పనిచేయకపోవడానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. ఒక వైపు వేసవి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి. అధికశాతం ప్రయాణికులు శీతల ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. ఆయా బోగీల్లో ఏసీలు తప్ప ఫ్యాన్లు ఉండవు. కిటీకీలు తెరవడానికి వీలుండదు. అలాంటి బోగీల్లో ఏసీలు పనిచేయకపోతే ఇక అంతే.. గాలి కూడా ఆడదు. ఊపిరి ఆడక విలవిల్లాడాల్సిందే.
* స్టేషన్‌లో రైలు ఆగినప్పుడల్లా ఏసీలు పనిచేయకపోవడంతో రాత్రుళ్లు నిద్ర సరిగా పట్టడం లేదని, వృద్ధులు, పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. జనరల్‌, స్లీపర్‌ బోగీలు తగ్గించి ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ ఏసీ బోగీల్లో సౌకర్యాలు పెంచడంపై లేదనే విమర్శలు రైల్వేబోర్డు మూటకట్టుకుంటోంది.
* ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత సమస్యకు కారణాలు విశ్లేషించి.. పరిష్కరించాల్సిన రైల్వే అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని