logo

అధికారులు ఆదమరిచారు.. స్మగ్లర్లు కన్నేశారు!

తునికాకు... బీడీల తయారీకి వినియోగించే ఆకు ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు ప్రాంతంలో ఏటా వందలమంది గిరిజనులు ఏటా వేసవిలో అడవుల్లోకి వెళ్లి ఆకులను సేకరించి గుత్తేదారులకు విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతుంటారు.

Published : 26 May 2023 05:06 IST

ఉపాధికి వీలున్నవి సైతం నరికేస్తున్నారు
చెక్‌పోస్టుల్లో తనిఖీలు పక్కాగా లేకే అక్రమాలు
నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ అటవీప్రాంతం

తునికాకు... బీడీల తయారీకి వినియోగించే ఆకు ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు ప్రాంతంలో ఏటా వందలమంది గిరిజనులు ఏటా వేసవిలో అడవుల్లోకి వెళ్లి ఆకులను సేకరించి గుత్తేదారులకు విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతుంటారు. కొయ్యూరు మండలం మంప, ఎం.మాకవరపాలెం, చింతలపూడి తదితర ప్రాంతాల్లోనూ గతంలో తునికాకు సేకరణ ముమ్మరంగా జరిగేది. మూడేళ్లపాటు ఆకులు సేకరించుకోవడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ గుత్తేదారు గుత్త (లీజు) తీసుకున్నారు.

* గతనెల 28న నర్సీపట్నం అటవీరేంజ్‌ సిబ్బంది యర్రవరం చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకుని కలపతో వస్తున్న వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని నర్సీపట్నం కలపడిపోకు తీసుకువచ్చి పరిశీలించారు. దాంట్లోని కలప నల్లతుమ్మగా గుర్తించి వదిలిపెట్టిన అదే వ్యాన్‌ను కాకినాడ జిల్లా కోటనందూరు వద్ద తుని అటవీసిబ్బంది స్వాధీనం చేసుకుని పరిశీలించినప్పుడు వ్యాన్‌లో కలప తుమ్మిక (బీడీ ఆకుల చెట్లు)గా నిర్ధారించారు. గిరిజనులు బీడీ ఆకులు సేకరించుకోవడానికి తప్ప మరెందుకూ పనికి రావని భావించే చెట్లు జిల్లాలు దాటి తరలించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్నది ఇప్పుడు అటవీశాఖ విజిలెన్స్‌ అధికారులు నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

* గతంలో నరమామిడిచెక్క విస్తారంగా లభించేది. గిరిజనులు చెక్క ఒలిచి జీసీసీకి లేదా ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించుకుని ఉపాధి పొందేవారు. చెక్కని జాగ్రత్తగా ఒలిచి తీసుకోవాల్సి ఉండగా చాలామంది చెట్లని నరికేశారు. ఇలాంటి చర్యలు వల్ల క్రమేపీ నరమామిడి చెట్లు తగ్గిపోయాయి. అగరుబత్తి పరిశ్రమలో ఈ చెక్క వాడేవారు. ఇప్పుడు తుమ్మిక చెట్లని సైతం నరికేసిన ఘటన తొలిసారి కాకినాడ జిల్లా కోటనందూరులో వెలుగుచూసింది. నరికివేత ఎన్నాళ్లుగా సాగుతుందో, ఎన్ని చెట్లు కూల్చివేతకు గురయ్యాయో తెలియాల్సి ఉంది. పట్టుబడ్డ వాటిలో కొన్ని చెట్లు అటవీహక్కు చట్టం ప్రకారం గిరిజనులు పొందిన భూమిలోనివని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. నరికివేత యథేచ్ఛగా కొనసాగితే సమీప భవిష్యత్తులోనే ఈ చెట్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ఇక్కడి గిరిజనుల ఉపాధికే కాదు. బీడీల తయారీపై ఆధారపడి జీవించే ఇతర ప్రాంతాల కార్మికులకు ప్రయోజనాలకు ఇబ్బందే. జిగురు సేకరించే కోవెల చెట్లు, లక్కబొమ్మల తయారీలో ఉపయోగపడే అంకుడు చెట్లు ఇలా ఉపాధి మిళితమైన వృక్షాలన్నీ తరిగిపోతున్నాయి. వాటిస్థానంలో సామాజిక అడవుల విభాగం కొత్త మొక్కలు నాటించడం లేదు. అటవీ అధికారులు ఇప్పటికైనా మేలుకోవాల్సి ఉంది.

అడ్డతీగల అటవీ ప్రాంతంలో ఇటీవల నరికివేతకు గురైన తుమ్మిక చెట్టు


గిరిజనుల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని గతంలో జనవరి నెలలోనే అటవీశాఖ తూనిక చెట్లను ప్రూనింగ్‌ చేయించేది. తద్వారా ముదురు ఆకుల స్థానంలో కొత్త ఆకులు చిగురించేవి. వాటిని ఎండాకాలమంతా గిరిజనులు సేకరించి కల్లాల్లో ఆరబెట్టి నలభై కిలోల చొప్పున బస్తాల కెత్తి గుత్తేదారుకు విక్రయించుకునేవారు. నిధులు లేవంటూ ఫ్రూనింగ్‌ పనులను అటవీశాఖ ఇటీవలి కాలంగా చేయించడం లేదు. కొన్ని చోట్ల గుత్తేదారు సొంతంగా డబ్బులు వెచ్చించి ప్రూనింగ్‌ చేయించుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. రవాణా సమయంలో అటవీశాఖ సిబ్బంది నుంచి తగిన సహకారం ఉండడం లేదు. ఇలాంటి ఇబ్బందులన్నీ పడలేక ఈ ఏడాది తునికాకు సేకరించలేదని గుత్తేదారు చెబుతున్నారు. సేకరణ లేకపోవడం వల్ల గిరిజనులను అడవుల్లోకి వెళ్లడం లేదు. ఇదే అదనుగా కొందరు చెట్లను అక్రమంగా నరికించి తరలించుకుపోయే ప్రమాదం ఉంది.


ఈ ఏడాది సెప్టెంబరు వరకు లీజుదారుడికి గడువు ఉంది. గతేడాది దాదాపు రెండువేల బస్తాల వరకు ఆకు సేకరించిన గుత్తేదారు ఈ ఏడాది ఇప్పటి వరకు సేకరణ మొదలేపెట్టలేదు. ఆకులన్నీ అడవి పాలయ్యే పరిస్థితి నెలకొన్నా సేకరణ ఎందుకు జరగలేదన్న విషయంపై ఉన్నతాధికారులు ఇప్పటి వరకు దృష్టి సారించలేదు.


* తునికాకు సేకరణ అంశాన్ని చింతపల్లి డీఎఫ్‌వో సీహెచ్‌.సూర్యనారాయణ పడాల్‌ దృష్టికి తేగా మూడేళ్లకోసారి తునికాకు సేకరణకు వేలం నిర్వహిస్తున్నామన్నారు. గుత్తేదారుకు ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు ఉందన్నారు. గడువు ముగియగానే వచ్చే ఏడాది నుంచి సేకరణకు వేలం నిర్వహిస్తామని తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని