logo

మొక్కజొన్న రైతుకు నష్టాల పొత్తు

జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నిండా మునిగారు. ఒకవైపు పంటపై పురుగుల దాడి.. మరోవైపు ఎప్పుడూ లేనివిధంగా ధరలు పతనం కావడం సాగుదారులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి.

Published : 29 May 2023 06:14 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నిండా మునిగారు. ఒకవైపు పంటపై పురుగుల దాడి.. మరోవైపు ఎప్పుడూ లేనివిధంగా ధరలు పతనం కావడం సాగుదారులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. జిల్లాలో ఏటా 450 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తుంటారు. అనకాపల్లి, మునగపాక, నాగులాపల్లి, మూలపేట, తుమ్మపాల, అరబుపాలెం వంటిలో సాధారణ రకాలతోపాటు తీపి మొక్కజొన్న సాగు చేస్తుంటారు. దీనిని కేవలం తినడానికే ఉపయోగిస్తారు. అనకాపల్లి మార్కెట్‌లోని వ్యాపారులే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. టోకుగా కొనుగోలు చేసిన పొత్తులను గాజువాక, విశాఖపట్నం మార్కెట్లకు తరలిస్తారు.

తీపి మొక్కజొన్న సాగు ఖర్చు ఎక్కువే. కానీ సకాలంలో అమ్మకం చేయాలి. పొత్తు పక్వదశకు వచ్చిన వారంలో అమ్మలేకపోతే ముదిరిపోయి తినడానికి పనికిరాదు. సాధారణ రకాల కంటే ధర ఎక్కువగా వస్తుందనే ఆశతో ఇటీవల కాలంలో దీని సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ముగిసిన రబీలో దాదాపు వంద ఎకరాల వరకు తీపి మొక్కజొన్న సాగు చేశారు. 20 సెంట్ల భూమికి కేజీ విత్తనం అవసరం. దీనికి రూ. 2,200 నుంచి రూ. 2,500 వరకు ఖర్చవుతుంది. తీపి మొక్కజొన్న విత్తనం ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ప్రైవేటు వ్యాపారులే విక్రయిస్తుంటారు. ఈసారి మొక్క బాల్యదశ నుంచే పురుగులు ఆశించాయని రైతులు అప్పలనాయుడు తెలిపారు. క్రిమిసంహారక మందులతో ఏదోవిధంగా పంటను కాపాడుకోగలిగారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. వంద పొత్తులు రూ. 200 నుంచి రూ. 300కి అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక దశలో రూ. 120కి పండిపోయాయి. దీంతో రవాణా ఖర్చులూ రాకపోవడంతో కొందరు రైతులు పంట కోయకుండా విడిచిపెట్టారు. గతేడాది రూ. 450 నుంచి రూ. 600 వచ్చిందని రైతులు తెలిపారు. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగులు ఎక్కువగా సోకుతున్నాయి. ఇవి ఉదయం, సాయంత్రం సమయాల్లో పంటను నష్టపరుస్తాయి. ఆకులలోని పత్రహరితాన్ని తింటాయి. మొవ్వులో చేరి లేత ఆకులను తింటాయి. పొత్తులు బాల్యదశలో ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించి లేత గింజలను తినేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పురుగులు రబీ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.

వ్రిత్తనం ఖర్చు రాలేదు

తీపి మొక్కజొన్న పంటను 40 సెంట్ల భూమిలో వేశాను. విత్తనానికే దాదాపు రూ. 5 వేల ఖర్చు అయింది. పంట అమ్మాక కనీసం విత్తనం ఖర్చులు రాలేదు. కూలీలు, పురుగు మందులు, ఎరువులు, దుక్కు వంటి ఇతర ఖర్చులు మరో రూ. 20 వేల వరకు అయింది. గతంలో ఆకులకు పురుగులు పట్టేవి. ఈసారి పొత్తుల్లో చేరాయి. వీటిని నిర్మూలించడం చాలా ఇబ్బంది అయింది. పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఒక దశలో వంద పొత్తులు రూ. 150కి అమ్మాల్సి వచ్చింది. 


 పీలా జగ్గారావు, రైతు, మునగపాక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని