logo

గ్రీన్‌బెల్ట్‌లో.. ఆక్రమణల పర్వం

మద్దిలపాలెం మొదలుకొని ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వరకు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రీన్‌బెల్ట్‌లో ఆక్రమణల పర్వం ఇంకా కొనసాగుతోంది.

Updated : 29 May 2023 06:42 IST

కంచెకొన్నిచోట్లే..

జాతీయ రహదారి కంచరపాలెం బస్‌స్టాప్‌ ఎదురుగా గ్రీన్‌బెల్ట్‌లో చెట్లను పూర్తిగా తొలగించి చేపలమార్కెట్‌ను ఏర్పాటు చేశారు.

మద్దిలపాలెం మొదలుకొని ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వరకు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రీన్‌బెల్ట్‌లో ఆక్రమణల పర్వం ఇంకా కొనసాగుతోంది. పచ్చని చెట్లను తొలగించి కొంత మంది వ్యాపార కార్యకలాపాలకు, మరికొందరు వాహనాల పార్కింగ్‌ స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. జీ-20 సదస్సులో భాగంగా జీవీఎంసీ ఆధ్వర్యంలో సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసి గ్రీన్‌బెల్ట్‌ను కాపాడే చర్యలు చేపట్టినా అవి తూతూమంత్రంగానే మిగిలిపోయాయి.

జాతీయ రహదారిలో రాకపోకలు సాగించే వాహనాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు వీలుగా గతంలో గ్రీన్‌బెల్ట్‌ను రూపకల్పన చేశారు. ఎప్పటికప్పుడు అందులో చెట్లను నాటుతూ పచ్చదనం పరిరక్షణకు చర్యలు తీసుకోవల్సి ఉంది. గ్రీన్‌బెల్ట్‌కు ఆనుకొని నిర్మాణాలు, పలు షోరూములు, వివిధ సంస్థలు రావడంతో ఆక్రమణల పర్వం మొదలైంది.

* ఎన్‌ఎస్‌టీఎల్‌ గేటు ఎదురుగా ఉన్న గ్రీన్‌బెల్ట్‌ను ఎదురుగా ఉన్న ఒక బార్‌ యాజమాన్యం, అక్కడ ఉన్న వివిధ దుకాణదారులు పార్కింగ్‌ స్థలంగా వాడుకుంటున్నారు. జాతీయ రహదారి కంచర పాలెం పోలీస్‌స్టేషన్‌ నుంచి పంజాబుహోటల్‌ కూడలి వరకు ఉన్న నాలుగు వాహన షోరూంలకు సంబంధించిన యాజమాన్యాలు గ్రీన్‌బెల్ట్‌లో షెడ్డులు వేసి వాటిలో కార్లను నిలిపి క్రయవిక్రయాలు చేస్తున్నారు. తక్షణమే జీవీఎంసీ అధికారులు స్పందించి ఆక్రమణలను కట్టడి చేయాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

అక్కయ్యపాలెం కూడలి నుంచి వెళ్లే మార్గంలో తాటిచెట్లపాలెం అభయాంజనేయస్వామి ఆలయానికి సమీపంలో రహదారి పక్క కంచె వేసి కిందన వదిలేశారు. దీంతో అటువైపుగా లోపలికి వెళ్లేందుకు ఆస్కారం ఉండటంతో ఆ స్థలం క్రీడా మైదానంలా మారింది.

తాటిచెట్లపాలెం నుంచి అక్కయ్యపాలేనికి వచ్చే మార్గంలో జాతీయ రహదారి పక్కన వైఎస్సార్‌ కాలనీ దరి అన్నా క్యాంటీన్‌ సమీపంలో గ్రీన్‌బెల్టుకు కంచె లేదు. ఆ ప్రాంతాన్ని స్థానికులు ఆటోల మరమ్మతులకు వినియోగిస్తున్నారు. దీనికి ఆమడదూరంలో కంచె వేసినప్పటికీ... కిందవైపు లేకపోవడంతో లోపల గేదెలను కట్టి సొంత స్థలంగా వాడుకుంటున్నారు.

నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే మార్గం పక్కన కంచె కూడా లేదు. సమీప దుకాణదారులు అందులో కార్ల మరమ్మతులు చేసుకుంటున్నారు. గురుద్వారా కూడలి సమీపంలో ఎడమ చేతి వైపు గ్రీన్‌బెల్టు ప్రాంతంలో కంచె వేయలేదు. దీంతో ఆ ప్రాంతాన్ని అక్కడున్న దుకాణదారులు పార్కింగ్‌ స్థలం, టిఫిన్‌ వ్యాపారానికి వినియోగిస్తున్నారు.

గురుద్వారా కూడలి నుంచి కావేరి కల్యాణ మండపానికి వెళ్లే మార్గం పక్కన గ్రీన్‌బెల్టులో చిన్న ముక్క కంచె వేసి వదిలేశారు. మిగతా ప్రాంతమంతా ఖాళీ. దీంతో అక్కడ కార్ల దుకాణదారులు ఇష్టానుసారం తమ వ్యాపారాలను సాగిస్తున్నారు. ఇక్కడ జీవీఎంసీ అధికారులు కంచె వేసేందుకు ప్రయత్నించగా రాజకీయ నాయకుల సూచనలతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

బిర్లా కూడలి బస్‌స్టాప్‌ వద్ద మినీ వ్యాన్‌ స్టాండ్‌ను ఏర్పాటు చేసి, నిలిపిన వాహనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని