logo

చెరువులో చెరువు.. ‘ఉపాధి’ దరువు

సాధారణంగా ఎక్కడైనా నీటి సంరక్షణకు కొత్త చెరువు తవ్వుతారు. లేదా ఉన్న చెరువులో పూడిక తీసి గట్లు బలోపేతం చేస్తారు.

Updated : 31 May 2023 04:58 IST

ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారంటూ ఫిర్యాదులు

వెంకటపతిరాజు చెరువులో పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: సాధారణంగా ఎక్కడైనా నీటి సంరక్షణకు కొత్త చెరువు తవ్వుతారు. లేదా ఉన్న చెరువులో పూడిక తీసి గట్లు బలోపేతం చేస్తారు. దానికి విరుద్ధంగా పాయకరావుపేట మండలంలోని శ్రీరాంపురంలో ఉపాధి హామీ పథకంలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో దాని మధ్యలోనే మరో చెరువు తవ్వేస్తున్నారు. ఇదేమీ చోద్యమంటూ జలవనరుల శాఖ అధికారులు అడ్డుకున్నా..అంతా మా ఇష్టం అంటూ సిబ్బంది పనులు జరిపించేస్తున్నారు.

పంచాయతీ తీర్మానం లేదు...

ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్రీరాంపురంలోని వెంకటపతిరాజు చెరువులో చేపట్టిన పనులు వివాదాస్పదంగా మారాయి. దీనిలోకి తాండవ నుంచి సాగునీరు చేరుతోంది. వెంకటనగరం, శ్రీరాంపురం తదితర గ్రామాల్లోని పంట భూములకు నీరందుతోంది. దీనిలో పనులు చేపట్టేందుకు పంచాయతీ తీర్మానం చేయాల్సి ఉంది. అదేమీ పట్టించుకోకుండానే పనులు మొదలు పెట్టారు. తీరా చూస్తే చెరువులో పూడిక తీయకుండా మరో కొత్త చెరువు దర్జాగా తవ్వేస్తున్నారు. చెరువు గర్భంలోని మట్టిని తొలగించి నాలుగు వైపులా గట్లు వేస్తున్నారు. ఇలా తవ్వడం వల్ల పూర్తిస్థాయిలో సాగునీరు పంట భూములకు చేరే అవకాశం లేదు.  దీంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. కేవలం చేపల పెంపకానికి అనువుగా మరోసారి దాన్ని సిద్ధం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జలవనరుల శాఖకు తెలియకుండా పనులు చేయడంతో నిలిపివేయాలని ఆ శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. దీన్ని ఉపాధి హామీ సిబ్బంది పెడచెవిన పెట్టారు. తవ్వకం పనులు జరిపించేస్తున్నారు.

చెరువు మధ్యలో అడ్డుగా గట్టు వేస్తున్న కూలీలు

నిబంధనలకు  విరుద్ధంగా చేస్తున్నారు..

చెరువు గర్భంలోనే మరో చెరువు తవ్వడం నిబంధనలకు విరుద్ధం. భవిష్యత్తులో పంట భూములకు సజావుగా నీరు అందదు. దీన్ని ఉపాధి హామీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం. పనులు నిలిపివేస్తాం.

లోకేష్‌, ఏఈ, జలవనరుల శాఖ

కలెక్టర్‌కు ఫిర్యాదు

పనులు జరుగుతన్న తీరు దారుణం. పంచాయతీ తీర్మానం తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. చెరువులో పూడిక తీస్తే అభ్యంతరం ఏమీ లేదు. ఎవరితోనూ సంప్రదించకుండా అడ్డగోలుగా పనులు జరిపిస్తున్నారు. రైతులు నష్టపోయే అవకాశముంది. దీనిపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తున్నాం.

జి.కృష్ణప్రసాద్‌, సర్పంచి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని