logo

‘గురుద్వారా’లో ముదిరిన వివాదం

విశాఖ నగరంలో ‘గురుద్వారా’లో వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అధ్యక్షులు దిల్షా సింగ్‌ ఆనంద్‌ ట్రస్టు ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడుస్తున్నారని, చట్ట ప్రకారం పని చేయడం లేదంటూ కొందరు సభ్యులు ఆరోపణలకు దిగారు.

Updated : 31 May 2023 04:33 IST

నిధుల దుర్వినియోగంపై సభ్యుల ఆరోపణ

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ నగరంలో ‘గురుద్వారా’లో వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అధ్యక్షులు దిల్షా సింగ్‌ ఆనంద్‌ ట్రస్టు ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడుస్తున్నారని, చట్ట ప్రకారం పని చేయడం లేదంటూ కొందరు సభ్యులు ఆరోపణలకు దిగారు. పదవీ కాలం రెండేళ్లే అయినా..ఎనిమిదేళ్లుగా అనధికారికంగా, ఇష్టారాజ్యంగా ఆ పదవిలో కొనసాగుతున్నారని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగని వ్యవహారంపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. గురుద్వారాకు వచ్చే నిధులను సైతం సొంతానికి ఉపయో గించుకుంటున్నారని, నెలకు రూ.4 లక్షల వరకు వచ్చే ఆదాయాన్ని ఖర్చులుగా చూపి నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపించారు. ట్రస్టు సభ్యులైన అమన్‌దీప్‌ సింగ్‌, బల్విందర్‌ సింగ్‌లు ఈ విషయంపై కమిటీలో ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదు చేసినట్లు ‘ఈనాడు-ఈటీవీ’కి తెలిపారు. దిల్షాసింగ్‌ ఆనంద్‌కు రాష్ట్ర సింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చేందుకు అడుగులు పడుతున్న నేపథ్యంలో ట్రస్టు సభ్యులు చేస్తున్న తీవ్ర ఆరోపణలతో ‘గురుద్వారా’ వివాదం చర్చనీయాంశమవుతోంది. కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవికి అనర్హుడంటూ ప్రభుత్వానికి విన్నవించేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.

సేవకిచ్చిన స్థలంలో వ్యాపారం: నగరం నడిబొడ్డున సింగ్‌ సోదరులు ప్రత్యేక పూజలకు గురుద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు 1981లో భూమి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టారు. అప్పటి నుంచి జిల్లాలో సింగ్‌ కుటుంబీకులు పండుగలు నిర్వహించుకునే పవిత్ర స్థలంగా మారింది. ఈ తరుణంలో సింగ్‌లు ఐక్యంగా ఒక అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ‘గురుద్వారా సద్‌ సంగత్‌’ అనే పేరుతో ట్రస్టు నిర్వహిస్తున్నారు. 15 మంది సభ్యులతో ఏర్పడిన ఈ ట్రస్టులో దిల్షా సింగ్‌ ఆనంద్‌ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత పలు ఆరోపణలు వచ్చాయి. గురుద్వారా మందిరానికి ఆనుకుని జీవీఎంసీ గ్రీన్‌ బెల్ట్‌ స్థలం 600 చదరపు గజాల్లో మొక్కలతో సుందరీకరణ చేసుకునేలా ట్రస్టుకు జీవీఎంసీ అనుమతిచ్చింది. గ్రీన్‌బెల్ట్‌ స్థలాన్ని దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చినట్లు అధ్యక్షునిపై ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూమిలో ఇలా వ్యాపారం చేయడం నిజమేనని తేలడంతో ఇటీవల దుకాణాలను జీవీఎంసీ తొలగించింది. దీంతో అధ్యక్షునికి అడ్వాన్సులు చెల్లించిన వ్యాపారులు వెనక్కి ఇచ్చేయాలని కోరుతున్నా చెల్లించడం లేదని తెలిపారు. ఏడాది కాలంగా ఇలా గ్రీన్‌బెల్ట్‌లో దుకాణాల ద్వారా ఆదాయం, గురుద్వారాకు భక్తుల నుంచి వచ్చే ఆదాయంపై సరైన లెక్కలు చూపక జేబులు నింపేసుకుంటున్నారని పలువురు ట్రస్టు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై వివరణ తీసుకునేందుకు అధ్యక్షున్ని ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని