logo

గుండెకు సుస్తీ..!

కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌) కార్డియో థొరాసిక్‌ విభాగంలో గుండె శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) నిలిచిపోయాయి. రెండున్నర నెలల నుంచి ఈ పరిస్థితి నెలకొంది.

Updated : 01 Jun 2023 04:52 IST

పెద్దాసుపత్రిలో నిలిచిన శస్త్రచికిత్సలు
పేద రోగులపై ఆర్థిక భారం
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

శస్త్రచికిత్స విభాగం

కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌) కార్డియో థొరాసిక్‌ విభాగంలో గుండె శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) నిలిచిపోయాయి. రెండున్నర నెలల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఊపిరితిత్తులు, థొరాసిక్‌కు సంబంధించిన తేలికపాటి చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. నిపుణులైన ఇద్దరు వైద్యాధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్న పరికరం లేకపోవడంతో కీలక శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారు. దీంతో పేద రోగులు ప్రాణాలను కాపాడుకోవడానికి కార్పొరేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రూ.లక్షలు అప్పు చేసి చికిత్స పొందుతున్నారు.

* కేజీహెచ్‌లో గత కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా బైపాస్‌, ఓపెన్‌హార్ట్‌ సర్జరీలు చేసేవారు. నెలకు 15 నుంచి 20 మంది ఆయా చికిత్సలు జరిగేవి. శస్త్రచికిత్స వైద్య నిపుణులు ఉండడంతోపాటు, ఆపరేషన్లకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, అనువైన థియేటరు, ఆపరేషన్‌ తర్వాత రోగి కోలుకోవడానికి అవసరమైన ఐసీయూ విభాగం అందుబాటులో ఉన్నాయి. దీంతో గుండె శస్త్రచికిత్సలను నిరంతరాయంగా చేసేవారు. రెండున్నర నెలల క్రితం కీలకమైన హార్ట్‌లంగ్‌ వైద్య పరికరం మరమ్మతులకు గురైంది. రూ.20లక్షల విలువ చేసే ఈ యంత్రం గుండె శస్త్రచికిత్సలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఏమిటీ హార్ట్‌ లంగ్‌ యంత్రం..

* ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసే సమయంలో గుండె పనిచేయదు. ప్రత్యామ్నాయంగా హార్ట్‌లంగ్‌ యంత్రం ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌తో కూడిన రక్తం సరఫరా అయ్యేలా చేస్తారు. అంటే గుండె, ఊపిరితిత్తులు చేయాల్సిన పని ఈ వైద్య పరికరం చేస్తుంది. దీన్నే కార్డియో పల్మనరీ బైపాస్‌ పంప్‌ అని కూడా పిలుస్తారు. ఆరేడేళ్ల కిందట కొనుగోలు చేసిన యంత్రాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. సరైన నిర్వహణ లేకపోవడం, యంత్రం చెడిపోయిన వెంటనే మరమ్మతులు చేసే టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో  పునరుద్ధరణకు నోచుకోలేదు. అలాగని కొత్త యంత్రం కొనుగోలు చేసే ప్రతిపాదన కూడా చేయలేదు.

* ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున సీఎస్‌ఆర్‌ నిధులు రూ.6 కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రిలో రోగులు, సహాయకులకు పలు వసతులు కల్పించారు. హార్ట్‌ లంగ్‌ వైద్య పరికరం విషయంలో మాత్రం ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైద్యాధికారులు ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లలేదని సమాచారం. డీఎంఈకి తెలుపగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నుంచి సరైన స్పందన రాలేదు.

ప్రయివేటులో రూ.లక్షల్లో ఖర్చు

* ఇటీవల కాలంలో పలువురు గుండె జబ్బుల బాధితులకు కేజీహెచ్‌లో యాంజియోగ్రామ్‌ చేస్తున్నారు. అవసరమైన వారికి స్టంట్లు కూడా వేస్తున్నారు. బైపాస్‌ సర్జరీ వంటి శస్త్రచికిత్సలకు మాత్రం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. ప్రయివేటులో ఇలాంటి చికిత్సలకు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆర్థిక స్థోమత ఉన్నవారు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు పెద్దగా ఇబ్బంది ఉండడం లేదు. ఆరోగ్యశ్రీ లేని పేదలు ప్రయివేటులో వైద్యం చేయించుకోలేక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా కొత్త హార్ట్‌లంగ్‌ యంత్రం సమకూర్చి గుండె ఆపరేషన్లను పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు