logo

వైకాపా కార్యాలయ పనులు అడ్డుకోలేరా?

ఎవరైనా పేదలు చిన్న ఇల్లు కట్టుకుంటే జీవీఎంసీ ప్రణాళికా విభాగం, సచివాలయ సిబ్బంది కాకుల్లా వాలిపోతారని, ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం జోలికి ఎందుకు వెళ్లడం లేదని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ప్రశ్నించారు.

Published : 01 Jun 2023 04:27 IST

జీవీఎంసీ తీరుపై పీలా ధ్వజం

జోనల్‌ కమిషనర్‌కు వినతపత్రం ఇస్తున్న పీలా, చినతల్లి

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఎవరైనా పేదలు చిన్న ఇల్లు కట్టుకుంటే జీవీఎంసీ ప్రణాళికా విభాగం, సచివాలయ సిబ్బంది కాకుల్లా వాలిపోతారని, ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం జోలికి ఎందుకు వెళ్లడం లేదని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ప్రశ్నించారు. కొత్తూరు నర్సింగరావుపేటలో వైకాపా కార్యాలయ నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జోనల్‌ కార్యాలయం ఆవరణలో ఆందోళన చేపట్టారు. కార్పొరేటర్‌ మాదంశెట్టి చినతల్లితో కలిసి జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. పీలా మాట్లాడుతూ సహ చట్టం ద్వారా వివరాలు సేకరించామని, వైకాపా కార్యాలయ భవనానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు. గ్రామస్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిర్మాణాలు చేపట్టొదని ఉత్తర్వులు ఇచ్చిందని, అయినా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. ఆడ్డుకోవాల్సిన జీవీఎంసీ అధికారులు వైకాపాకు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. తెదేపా హయాంలో కాపు సామాజిక భవనానికి కేటాయించిన స్థలంలో వైకాపా కార్యాలయం కడుతోందన్నారు. అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశామన్నారు. గత ఎన్నికల సమయంలో గుడివాడ అమర్‌నాథ్‌ కులం పేరు చెప్పుకొని గెలిచి సొంత కులానికే పంగనామాలు పెడుతున్నారని ఆరోపించారు. తక్షణం నిర్మాణం ఆపకపోతే మరోసారి న్యాయస్థానానికి వెళ్లడమే కాకుండా పార్టీ తరఫున ఆందోళన చేస్తామన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే అదే స్థలంలో కాపు సామాజిక భవనం నిర్మిస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. నాయకులు మాదంశెట్టి నీలిబాబు, సిరసపల్లి సన్యాసిరావు, కసిరెడ్డి సత్యనారాయణ, బీఎస్‌ఎంకే జోగినాయుడు, మళ్ల సురేంద్ర, సబ్బవరపు గణేష్‌, ఆళ్ల రామచంద్రరావు, సూరే సతీష్‌, త్రినాథ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని