logo

కణమాంలో గ్రావెల్‌ దందా

ఆనందపురం మండలం కణమాం పంచాయతీ పరిధిలో కొండలు, వాటి మధ్య ఎటు వైపు వెళ్లినా రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌లు దర్శనమిస్తాయి. జగనన్న కాలనీ, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లేవుట్‌), ఏపీఐఐసీకి కేటాయించిన భూములన్నీ కొండలకు ఆనుకొనే ఉంటాయి.

Published : 01 Jun 2023 04:27 IST

ముఠా ఆగడాలను అడ్డుకున్న ఏపీఐఐసీ భూబాధిత రైతులు

కణమాంలో ఏపీఐఐసీకి కేటాయించిన భూముల్లో నుంచి గ్రావెల్‌ తరలించిన ప్రాంతం...వాహనాన్ని అడ్డుకున్న రైతులు

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం మండలం కణమాం పంచాయతీ పరిధిలో కొండలు, వాటి మధ్య ఎటు వైపు వెళ్లినా రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌లు దర్శనమిస్తాయి. జగనన్న కాలనీ, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లేవుట్‌), ఏపీఐఐసీకి కేటాయించిన భూములన్నీ కొండలకు ఆనుకొనే ఉంటాయి. వీటిలో పనుల పేరిట కొందరు స్థానిక వైకాపా నాయకులు రెండేళ్లుగా గ్రావెల్‌ దందాకు పాల్పడుతున్నారు. ఇటీవల రహదారి నిర్మాణానికి భారీ యంత్రాలతో రాత్రి, పగలు గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఇప్పటి వరకు జగనన్న కాలనీ లేఅవుట్‌ చదును పేరిట గ్రావెల్‌ తరలించినా.. అభివృద్ధి కోసమే కదా అనే భావనతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.

* ఏపీఐఐసీ భూముల్లో: కణమాం రెవెన్యూ గ్రామంలో సుమారు 150 ఎకరాల కొండ ఏటవాలు ప్రాంతాన్ని గత ప్రభుత్వం ఏపీఐఐసీ సంస్థకు కేటాయించింది. దీనికి సంబంధించి దస్త్రాల ప్రక్రియ పూర్తి కావస్తున్నప్పటికీ సంబంధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇక్కడా తవ్వేస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు గనుల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంబంధిత వ్యక్తులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. బుధవారం ఉదయం కూడా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టడంతో రైతులు అడ్డుకోగా అక్కడి నుంచి యంత్రాలను హుటాహుటిన వేరొక చోటకు తరలించారు.

* కేసు నమోదు చేసినా..: రైతుల ఫిర్యాదుతో గనుల శాఖ అధికారులు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినా ఏపీఐఐసీకి కేటాయించిన భూముల్లోనూ, పక్కనే ఉన్న ఎంఐజీ లేవుట్‌ నుంచి గ్రావెల్‌ తరలించడంపై రైతులు అధికార యంత్రాంగంపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అక్రమార్కులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో కేసు మాఫీ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. తమకు నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని, లేకుంటే ఊరుకోబోమని బాధిత రైతులు అంటున్నారు. కణమాంలో గ్రావెల్‌ తరలింపు వ్యవహారాన్ని.. తహసీల్దార్‌ రామారావు వద్ద ప్రస్తావించగా దీనిపై తనకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని