logo

‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన

దేశ రక్షణ దళాల్లో ఆధునికీకరణ జరుగుతోందని, ఇప్పటి అవసరాలతోపాటు, 2047 నాటికి పూర్తిగా ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యాలను చేరుకునేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ వెల్లడించారు.

Published : 01 Jun 2023 04:27 IST

నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌

మాట్లాడుతున్న భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌

ఈటీవీ-విశాఖపట్నం: దేశ రక్షణ దళాల్లో ఆధునికీకరణ జరుగుతోందని, ఇప్పటి అవసరాలతోపాటు, 2047 నాటికి పూర్తిగా ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యాలను చేరుకునేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ వెల్లడించారు. నేవీలో ఉత్తమ సేవలందించిన పలువురికి విశాఖలో బుధవారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో పాల్గొన్న నేవీ చీఫ్‌ మీడియాతో మాట్లాడారు. ‘అగ్నిపథ్‌కి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే నేవీలో తొలి బ్యాచ్‌లోని 2,585 మందికి ఐఎన్‌ఎస్‌ చిల్కాలో మార్చిలోనే శిక్షణ పూర్తయింది. ఇందులో 272 మంది మహిళలు ఉన్నారు. నేవీలో అఫీసర్‌ కన్నా దిగువ స్థాయిలో మహిళలను నియమించుకోవడం ఇదే ప్రథమం. లింగ వివక్ష లేకుండా మహిళలకు అన్నిర్యాంకుల్లో సమాన అవకాశాలు భారత నౌకాదళం కల్పిస్తుంది. వారి ప్రతిభ అధారంగానే అవి లభిస్తాయి. రక్షణ దళాల్లో తొలి వరుసలో పోరాటానికి దిగే సైనికుల సగటు వయసు 32- 33 ఏళ్లుగా ఉందని, అగ్నిపథ్‌ నియామకాలుతో ఈ సగటు 25-26గా ఉంటుంది.  2024 ఫిబ్రవరిలో మిలాన్‌ మళ్లీ విశాఖ వేదికగా జరుగుతుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని ప్రత్యామ్నాయ నౌకాదళ స్థావరం 2024 నాటికి సిద్ధమయ్యేవిధంగా పనులు జరుగుతున్నాయి.

సిద్ధమవుతోంది...ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద రక్షణ రంగంలో ఇప్పటికే వందకు పైగా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రెండు ఉత్పత్తులు సైనిక దళాలకు అందుబాటులోకి వచ్చాయి. మరో పది ప్రయోగదశలో ఉన్నాయి. నేవీలో 62 నుంచి 65 శాతం వాటా పూర్తిగా దేశీయ కాంట్రాక్టులదే. దీనిని 80 శాతానికి పెంచేందుకు కృషి జరుగుతోంది. గత జులైలో జరిగిన ‘స్వావలంబన సెమినార్‌’లో 75 సాంకేతిక అంశాలపై 1,106 ప్రతిపాదనలు వచ్చాయి. ఇవి పలు ఉత్పత్తులకు నాంది పలికాయి. వచ్చే జూలైలో జరగనున్న సదస్సు నాటికి మరో 75 ఉత్పత్తులు ప్రయోగదశకు సిద్ధమవుతాయి. యుద్ధ విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా అన్ని ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నాయి. విశాఖకు ఎప్పుడు వస్తుందనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఫైటర్‌ జెట్‌ల లాండింగ్‌ వంటివి పగలు విజయవంతంగా సాగాయి. రాత్రి ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. నవంబర్‌ నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుంది. ఆరుగురు పైలెట్‌లు కూడా  దీనికోసం అర్హత సాధించారు’ అని వివరించారు. కార్యక్రమంలో తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌ గుప్తా, తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని