logo

చెత్తపై చిత్తశుద్ధి ఏదీ?

నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ అటకెక్కింది. తడి-పొడి చెత్త వేరు చేసే దగ్గరి నుంచి వర్మీకంపోస్టు తయారీ వరకు ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు.

Published : 02 Jun 2023 03:28 IST

తడి-పొడి వేరు చేయకుండానే కాపులుప్పాడకు తరలింపు
అలంకార ప్రాయంగా తరలింపు కేంద్రాలు
ఈనాడు-విశాఖపట్నం, కార్పొరేషన్‌-న్యూస్‌టుడే

తడి-పొడి చెత్త వేరే చేసేందుకు ప్రత్యేకంగా షెడ్డు

నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ అటకెక్కింది. తడి-పొడి చెత్త వేరు చేసే దగ్గరి నుంచి వర్మీకంపోస్టు తయారీ వరకు ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. కాపులుప్పాడలో వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్న యార్డు వద్దకే అన్ని వ్యర్థాలు తరలిస్తున్నప్పుడు కొత్తగా షెడ్లను, వర్మీకంపోస్టు యంత్రాలను ఏర్పాటు చేయడంపై అనుమానాలు రేగుతున్నాయి. కమీషన్లపై ఆశలు... స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందాలు వచ్చినప్పుడు చూపించుకోవడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయనే విమర్శలున్నాయి.

* అన్నీ కలిపేసి..: ఘన వ్యర్థాల నిర్వహణ- 2016 నిబంధన ప్రకారం ఇళ్ల నుంచి తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. జీవీఎంసీ పరిధిలో దాదాపు 5.43 లక్షల గృహాలున్నాయి. తడి, పొడి చెత్తతోపాటు ప్రమాదకర చెత్తను సేకరించేందుకు ప్రతి ఇంటికి మూడు రకాల బిన్స్‌ (చెత్త బుట్టలు) సరఫరా చేయాలి. నగరంలో క్లాప్‌ వాహనాలు 608 ఉండగా, అందులో 578 వాహనాలు నిత్యం చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. ఈ వాహనాల్లో క్యాబిన్‌లు సైతం తడి-పొడి చెత్తకు వేర్వేరుగా ఉంటాయి. ప్రజలకు అవగాహన పెంచినా చాలా చోట్ల కార్మికులు  రెండు రకాల చెత్తను వేరుగా వేయకుండా కలిపి క్లాప్‌ వాహనాల్లో కుక్కేస్తున్నారు.

* ఇక్కడే నిధులు వ్యర్థం: చెత్త తరలింపు కేంద్రాల్లో తడి-పొడి చెత్త వేరు చేయడానికి ఒక షెడ్డు, వర్మీకంపోస్టు తయారీకి యంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.15-20లక్షలు ఖర్చు చేస్తున్నారు. చీమలాపల్లి, ముడసర్లోవ, అప్పుఘర్‌, పాత నగరం, గాజువాక, భీమిలిలో ఇవి ఉన్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ ఇక్కడ తూతూమంత్రమే. వాస్తవానికి లక్ష్యం ఏంటంటే... నగరంలో ప్రతిరోజూ 1100 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. 700 టన్నులు కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు తరలిస్తూ...

దాదాపు 400 టన్నుల వ్యర్థాలను ఈ కేంద్రాల వద్దనే వేరు చేసి వర్మీకంపోస్టు, పొడి చెత్తలో కొన్నింటిని పునర్వినియోగానికి వేరు చేయాలి. ఇలా చేస్తేనే ఘనవ్యర్థాల నిర్వహణ లక్ష్యం నెరవేరినట్లు. అయితే విశాఖలో ఆ పరిస్థితి లేదు.

ప్రాజెక్టు వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు?:

కాపులుప్పాడలో వేస్ట్‌ ఎనర్జీ ప్లాంటును అందుబాటులోకి తెచ్చారు. భవన నిర్మాణ వ్యర్థాలు మినహా మిగిలిన వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. తడి-పొడి చెత్త వేరు చేయకుండా నేరుగా ఈ ప్లాంటులో వేసినా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నప్పుడు, ఉన్న వాటిలో లక్ష్యం దిశగా కార్యాచరణ లేనప్పుడు తరలింపు కేంద్రాలు ప్రత్యేకంగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏంటనేది నగరవాసుల ప్రశ్న. తాజాగా రూ.20లక్షలతో మేయర్‌ ఇటీవల మరో కేంద్రం ఏర్పాటు చేయడం గమనార్హం. కొందరు అధికారులు కేవలం కమీషన్ల కోసమే ఇలాంటి కేంద్రాలు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నారనే విమర్శలున్నాయి.

* రైతులకు అవగాహన శూన్యమే: తరలింపు కేంద్రాలకు తెచ్చిన చెత్తను వేరు చేయడానికి  50 నుంచి 100 మందిని ఈ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలి. కేంద్రాలకు క్లాప్‌ వాహనాల ద్వారా వచ్చే పొడి చెత్తలోని అట్టలు, పేపర్లు, ప్లాస్టిక్‌ వేరు చేయాలి. అలా వేరు చేసిన వాటిలో తిరిగి ఉపయోగించే వాటిని అమ్ముకుంటారు. తడి చెత్తలో కూరగాయలు, హోటళ్ల వ్యర్థాలను సేకరించి వర్మీకంపోస్టు తయారు చేసి రైతులకు అందజేయాలి. ఈ కేంద్రాలకు రైతులు వచ్చేలా అవగాహన కల్పించొచ్చు. అదీ జరగడం లేదు. ఇక్కడ వర్మీకంపోస్టు పూర్తిస్థాయిలో తయారు చేయడం లేదు. చేసిన కొంత కూడా మూలకు పడేస్తున్నారు.

వర్మీకంపోస్టు తయారీ యంత్రాలు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు