logo

మొక్కుబడిగా...సాయంత్రం ఓపీలు

కేజీహెచ్‌లో ఏడు విభాగాల్లో ప్రారంభమైన ‘సాయంత్రం ఓపీ’లకు రోగుల తాకిడి అంతంత మాత్రంగానే ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోజుకు ఒక్కో విభాగానికి ఒకరిద్దరు మాత్రమే వస్తున్నారు.

Published : 03 Jun 2023 03:27 IST

పూర్తిస్థాయిలో దృష్టిసారించని అధికారులు

ఓపీల నిర్వహణపై తనిఖీలు చేస్తున్న సీఎస్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ వాసుదేవ్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో ఏడు విభాగాల్లో ప్రారంభమైన ‘సాయంత్రం ఓపీ’లకు రోగుల తాకిడి అంతంత మాత్రంగానే ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రోజుకు ఒక్కో విభాగానికి ఒకరిద్దరు మాత్రమే వస్తున్నారు. కొన్ని విభాగాలకు అసలు రావడమే లేదు. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ రోగులు రాకపోవడంతో కొద్దిసేపు వేచి చూసి వారు సైతం వెనుదిరుగుతున్నారు.

* కేజీహెచ్‌లో ప్రసూతి, చర్మవ్యాధులు, మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, డెంటల్‌, పీడియాట్రిక్స్‌, ఆర్థో తదితర విభాగాల ఓపీలకు ఉదయం పూట రద్దీ ఎక్కువగా ఉంటోంది. నిత్యం ప్రతి విభాగానికి సుమారు 100 మంది వరకు రోగులు వస్తుంటారు. రద్దీ పెరిగితే రోగులకు పూర్తి స్థాయిలో  వైద్య అందించలేని పరిస్థితి. దీంతో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

గంట సమయం సరిపోదని..

గతంలో ఎన్నడూ సాయంత్రం పూట ఓపీలు నిర్వహించిన దాఖలాలు లేవు. తొలిసారిగా ఈ విధానం ప్రవేశపెట్టారు. అయితే కేవలం గంట సేపు మాత్రమే చూస్తుండడం, అదీ మధ్యాహ్న భోజన వేళకు అటుఇటుగా ప్రారంభమవుతుండడంతో రోగులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేజీహెచ్‌లో సాధారణంగా ఉదయం పూట ఓపీలు 9గంటలకు ప్రారంభమవుతాయి. ఓపీ చీటీల కోసం భారీ వరుస ఉంటుంది. చీటీ తీసుకొని వైద్యుని వద్దకు వెళ్లి, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొనే సరికి మధ్యాహ్నం 2గంటలు దాటిపోతోంది. ఉదయం పూట వస్తే కనీసం మూడు, నాలుగు గంటల సేపు పడుతోంది. అటువంటిది సాయంత్రం కేవలం గంట సమయంలో వైద్యుని సంప్రదింపులు, పరీక్షలు చేయించుకోవడం జరిగే పనికాదని పలువురు వెనుకంజ వేస్తున్నారు. కనీసం రెండు గంటల సేపైనా ఓపీలు నిర్వహిస్తే రోగులు పెరుగుతారని చెబుతున్నారు. దూర ప్రాంత వాసులు కాకున్నా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారైనా వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏడు విభాగాలకు కలిపి 10మందే..

కేజీహెచ్‌లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఈ కారణంగా మధ్యాహ్నం ఓపీ వేళలను 3 గంటల నుంచి 4గంటల వరకు ఖరారు చేశారు. ఈ సమయం అనుకూలంగా లేకపోవడంతో రోగుల నుంచి స్పందన రావడం లేదు. ఆసుపత్రి సీఎస్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ వాసుదేవ్‌ ప్రతీరోజూ సాయంత్రం పూట ఓపీలు నిర్వహిస్తున్నదీ లేనిదీ తనిఖీలు చేస్తున్నారు. ఏడు విభాగాలకు కలిపి రోజుకు 10 మంది వరకు వస్తున్నారని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళుతున్నారు.

ప్రచారం లేకపోవడమూ కారణమే..

మధ్యాహ్నం ఓపీల నిర్వహణపై అనుకున్నంత స్థాయిలో ప్రచారం లేదు. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తున్నామనే ధోరణిలో వైద్యాధికారులు ఉన్నారే తప్పా ఎక్కడా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయలేదు. రోగులు, వారి సహాయకులకు అవగాహన కల్పించడం లేదు. వైద్య సిబ్బంది గంటపాటు అందుబాటులో ఉండడమంటే సాధారణ విషయం కాదు. ఒక గంటలో కనీసం 20 మందిని వైద్యులు పరీక్షిస్తారు. ప్రయివేటుకు వెళితే కేవలం వైద్యుల కన్సల్టేషన్‌ ఫీజు రూ.300 నుంచి రూ.500 వరకు తీసుకుంటారు. అలాంటిది ఇక్కడ విలువైన వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి. మధ్యాహ్నం ఓపీలపై ప్రచారం నిర్వహించి, సమయం పెంచి చిత్తశుద్ధితో నిర్వహిస్తే పేద రోగులకు మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని