logo

రైల్వే స్టేషన్‌లో రద్దీ నియంత్రణకు చర్యలు

ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్‌లో ఉండిపోయారు.

Published : 04 Jun 2023 05:48 IST

ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళిక

రైల్వే సిబ్బందికి సూచనలు చేస్తున్నస్టేషన్‌ మేనేజర్‌ అరుణశ్రీ

ఈనాడు, విశాఖపట్నం, ఎంవీపీ కాలనీ, న్యూస్‌టుడే: ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్‌లో ఉండిపోయారు. శ్రీకాకుళం మీదుగా భువనేశ్వర్‌, హావ్‌డా వైపు వెళ్లాల్సిన కొన్ని రైళ్లు నిలిపేయడంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు స్టేషన్లోనే చాలా మంది ఉండిపోయారు. విశాఖ నుంచి బయలుదేరాల్సినవి, విశాఖ మీదుగా వెళ్లాల్సిన వాటిని తాత్కాలికంగా రద్దు చేయడంతో వేల మందికి నిరీక్షణ తప్పలేదు. రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ అరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ప్రయాణికులకు తగిన సహాయ సహకారాలు అందించాయి. ఆందోళనకు గురవ్వొద్దని ప్రత్యేక బృందాలతో అవగాహన కల్పించారు. గర్భిణులు, చంటిపిల్లలతో ఉన్న వారికి ప్రత్యేక సేవలందించారు. వృద్ధులు, మహిళలకు అవసరమైన ఆహారాన్ని ఉచితంగా అందించారు. నిత్యం విశాఖ మీదుగా 120 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. శుక్రవారం ప్రమాదం తరువాత సగానికిపైగా రైళ్లు ఆగిపోయాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారి వివరాలు తెలుసుకొని.. వారందరినీ సమీప ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో పంపించారు.
ఏ రైలు టికెట్‌ ఉన్నా వెళ్లేందుకు అవకాశం కల్పించారు. దీంతో శనివారం ఉదయం నాటికి 45 శాతం వరకు రద్దీని నియంత్రించగలిగారు.
* రైళ్ల రద్దు నేపథ్యంలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు పూర్తిస్థాయిలో డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కరెంట్‌ రిజిర్వేషన్‌ బుకింగ్‌ కౌంటర్‌ వద్ద అదనపు సిబ్బందిని నియమించారు. విచారణ కేంద్రాల వద్ద శుక్రవారం రాత్రి నుంచి అదనపు సిబ్బందిని నియమించి ఏ రైళ్లు ఉన్నాయి, ఏవి రద్దయ్యాయి అనే వివరాలు అందించారు.
* భువనేశ్వర్‌ వైపు వెళ్లాల్సిన రైళ్లు కొన్ని విశాఖ వచ్చి ఆగిపోయాయి. దీంతో వాటిని ఖాళీగా తిరిగి వెనక్కి పంపించాల్సి వచ్చింది. స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు ఖాళీగా ఉంచడం కోసం కొన్ని రైళ్లను అలా వెనక్కి పంపక తప్పలదేని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని