logo

హంగామా ఎక్కువ..ఆదరణ తక్కువ

విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దుతున్నామంటూ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంటున్నా కళాశాలల్లో చేరే వారు తక్కువే కనిపిస్తున్నారు.

Published : 04 Jun 2023 05:58 IST

కళాశాలల్లో ప్రవేశాలు అరకొర!

కళాశాలలో విద్యార్థులను చేర్చాలంటూ అధ్యాపకుల ప్రచారం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దుతున్నామంటూ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంటున్నా కళాశాలల్లో చేరే వారు తక్కువే కనిపిస్తున్నారు. ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చేరికలు జరుగుతున్నాయి.

జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శనివారం వరకు 268 మంది విద్యార్థులు  ప్రథమ సంవత్సరంలో చేరారు. అనకాపల్లి కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఆరుగురు, బైపీసీలో ఇద్దరు, సీఈసీ, హెచ్‌ఈసీలో ఒక్కొక్కరు చేరారు. 30 మంది వరకు దరఖాస్తులు తీసుకోగా 10 మందే ప్రస్తుతానికి వచ్చారు. ఏటేటా కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఫలితాలు తగ్గుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నుంచి ప్రథమ సంవత్సరం 2341 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 654 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం 2907 మందిలో 1208 మంది పాసయ్యారు. జిల్లా ప్రథమ సంవత్సరం 27.93 శాతం, ద్వితీయ సంవత్సరం 41.55 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నాడు నేడు కింద కళాశాలల్లో వసతులు మెరుగుపరుస్తున్నా.. అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ కళాశాల్లో ఎక్కువగా అతిథి అధ్యాపకులతోనే చదువులు సాగిస్తున్నారు. అధ్యాపకుల నియామకాలు లేకపోవడంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముమ్మర ప్రచారం.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించాలని జిల్లా వ్యాప్తంగా అధ్యాపకులు ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు అందజేశారు. సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి ఆయా ప్రాంతాల్లో వాలంటీర్లతో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. నాడు- నేడు కింద కళాశాలల్లో వసతులు వసతులు మెరుగుపరిచి ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతున్నా ముందుకు రావడంలేదు.


మెరుగైన బోధన.. వసతులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన విద్యాబోధన అందిస్తున్నాం.  విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.  నాడు-నేడు కింద అన్ని కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
సుజాత, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి, అనకాపల్లి



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని