logo

ముగిసిన నాటకోత్సవాలు

అనకాపల్లి జార్జిక్లబ్‌ ఆవరణలోని కొణతాల వెంకట నారాయణమ్మ కళా ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన నాటకోత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి.

Updated : 05 Jun 2023 03:31 IST

బాలనాగమ్మ నాటకంలో ఓ సన్నివేశం

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి జార్జిక్లబ్‌ ఆవరణలోని కొణతాల వెంకట నారాయణమ్మ కళా ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన నాటకోత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు మొత్తం ఆరు నాటికలు ప్రదర్శించారు. వైకే నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌, ఆదిలీలా ఫౌండేషన్‌ సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేశాయి. చివరిరోజు గుంటూరు వారి ‘నాన్నా నేనొచ్చేస్తా’,  చిలకలూరిపేట వారి ‘ఆలితో సరదాగా’ నాటికలను ప్రదర్శించారు. పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఏవిధంగా చెడిపోతున్నారో నాన్నా నేనొచ్చేస్తా నాటిక ద్వారా చూపించారు. పెళ్లయిన ఆడపిల్ల అత్తవారింటిలో వచ్చే చిన్న  సమస్యలను పరిష్కరించుకోవాలే కాని తరచూ పుట్టింటికి వచ్చేస్తానని చెప్పడం తగదనే ఇతివృత్తంతో నాటిక సాగింది. అమృతలహరి దర్శకత్వం వహించగా తాళాబత్తుల వెంకటేశ్వరరావు కథను అందించారు. హస్య భరితంగా సాగిన ఆలీతో సరదాగా నాటిక అందరిని ఆలోచింపచేసేదిగా ఉంది.  షేక్‌ షఫీ దర్శకత్వం వహించగా అద్దెపల్లి భరత్‌ కుమార్‌ రచించారు. జార్జిక్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బుద్ధ కాశీవిశ్వేశ్వరరావు, మళ్ల చంద్రశేఖర్‌, కోశాధికారి ఆళ్ల శ్రీను, నాటకోత్సవాల కన్వీనర్‌ కె.ఎం.నాయుడు, కళాపరిషత్‌ ప్రతినిధులు బొప్పన నరసింగరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

మైమరపించిన బాలనాగమ్మ నాటకం

మాడుగుల, న్యూస్‌టుడే: మోదకొండమ్మ జాతర సందర్భంగా మహారాజా కోటలో మూడు రోజులుగా హైదరాబాద్‌కు చెందిన సురభి నాటక సంస్థ నాటక ప్రదర్శనలు ఆహూతులను కట్టి పడేస్తున్నాయి. ఆదివారం రాత్రి బాల నాగమ్మ నాటక ప్రదర్శనలో మాయల ఫకీరు వేషధారణ, కార్యవర్థిరాజు బాలవర్థిరాజు బాలనాగమ్మ నటనతో పాటు మాయల ఫకీరు మహల్లో  పిశాచాల ధ్వని, హాహాకారాల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టు కున్నాయి. ఎంపీపీ రామధర్మజ, సర్పంచి కళావతి,  కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు, శ్రీనాథు శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు తిలకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని