logo

పోర్టులో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసుకుంటూ విశాఖ పోర్టు అథారిటీ ముందుకు సాగుతోందని పోర్టు ఛైర్మన్‌ ఎం.అంగముత్తు తెలిపారు.

Published : 05 Jun 2023 03:51 IST

ఛైర్మన్‌ ఎం.అంగముత్తు

సౌర విద్యుత్తు ప్రాజెక్టు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసుకుంటూ విశాఖ పోర్టు అథారిటీ ముందుకు సాగుతోందని పోర్టు ఛైర్మన్‌ ఎం.అంగముత్తు తెలిపారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోర్టు చేపట్టిన పలు పర్యావరణ హిత చర్యలను ఆయన వివరించారు. ‘ప్రధాని మోదీ ప్రకటించిన పంచామృత్‌ కార్యక్రమం అమలు దిశగా అడుగులు వేస్తున్నాం. హరిత్‌ సాగర్‌ మార్గదర్శకాలు-2023ను అనుసరించి పోర్టు బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌)ను రూపొందించే పనిలో ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువగా పోర్టు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. మరో 15 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు అవసరమైన భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. సీఎన్‌జీ, మిథనాల్‌, ఇథనాల్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ను వినియోగించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రూ.116.4 కోట్లతో నాలుగు కవర్డ్‌ స్టోరేజ్‌ యార్డుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దీనిలో 2,94,000 మెట్రిక్‌ టన్నుల సరకును నిల్వ చేయవచ్చు. సెప్టెంబర్‌ 2023 నుంచి మార్చి 2024 నాటికి దీన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నిల్వ సరకు నుంచి దుమ్ము గాలిలోకి చేరకుండా 100 ఎకరాల్లోని 8 కార్గో స్టోరేజ్‌ యార్డ్‌లపై 221 వాటర్‌ స్ప్లింకర్స్‌ ద్వారా నిత్యం నీటిని వెదజల్లుతున్నాం. పోర్టు పరిసరాలను శుభ్రం చేసేందుకు ఒక మెకానికల్‌ స్వీపింగ్‌ యంత్రం అందుబాటులో ఉంది. స్టాక్‌ యార్డ్‌లు, రైల్వే గూడ్స్‌పై టార్పలిన్‌ కప్పడం ద్వారా దుమ్ముపైకి లేవకుండా చర్యలు తీసుకుంటున్నాం.

630 ఎకరాల్లో గ్రీన్‌బెల్ట్‌

* పోర్టులోని 630 ఎకరాల్లో 5,65,000 మొక్కలతో గ్రీన్‌ బెల్ట్‌ను అభివృద్ధి చేశాం. స్వచ్ఛ సాగర్‌ కార్యక్రమంలో భాగంగా ఆర్కేబీచ్‌ వద్ద ఒక కిలోమీటరు తీర ప్రాంతాన్ని పోర్టు దత్తత తీసుకొంది. నగరం నుంచి సముద్రంలో కలిసే మూడు గెడ్డల వద్ద తెలియాడే చెత్తను 18నెలలపాటు తొలగించాం. పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఏటా రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆయా చర్యలకుగాను 2022లో పోర్టుకు గ్రీన్‌టెక్‌ ఎన్విరాన్‌మెంట్‌ అవార్డును లభించింద’ని ఛైర్మన్‌ అంగముత్తు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని