logo

సింహాద్రినాథుడికి వైభవంగా జ్యేష్ఠాభిషేకం

జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీచందనం పరిమళాలు వెదజల్లాయి.

Published : 05 Jun 2023 03:51 IST

సంప్రదాయబద్ధంగా మూడో విడత చందన సమర్పణ

స్వామి, అమ్మవార్లకు జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు

సింహాచలం, న్యూస్‌టుడే: జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీచందనం పరిమళాలు వెదజల్లాయి. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు జరిపారు. స్వామి సన్నిధిలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపారు. చందన సమర్పణలో భాగంగా సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసిన మూడు మణుగుల శ్రీగంధాన్ని పొత్తి వస్త్రంతో కలిపి సింహాద్రినాథుడికి అలంకరించారు. అనంతరం విశేష ఆరాధనలు, నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. జ్యేష్ఠమాసం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని ఆళ్వారాచార్యులు సమేతంగా ఆలయ ఆస్థాన మండపంలోని వేదికపై అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలు, ఫలోదకాలతో దేవతామూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ధూపదీప సేవలు చేసి శోడషోపచారాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు చందనం అలంకరించి విశేష పారాయణలతో కొలిచారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ నేతృత్వంలో అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని