logo

రక్షక భటుల భూమికే రక్షణ కరవు

జిల్లాలో అధికార పార్టీ నాయకుల భూ అక్రమాలపై తరచూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

Published : 06 Jun 2023 05:12 IST

ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మురళీకృష్ణ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో అధికార పార్టీ నాయకుల భూ అక్రమాలపై తరచూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భూతగాదాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ సోమవారం 30పైగా ఫిర్యాదులు వస్తే వాటిలో ఎక్కువ భూ తగాదాలే ఉన్నాయి. వివిధ సంఘటనలకు సంబంధించి బాధితులు ఎస్పీ కె.వి.మురళీకృష్ణకు విన్నవించారు. వీటిపై విచారణ చేసి న్యాయం చేయాలని స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓలకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ విజయభాస్కర్‌ (పరిపాలన) పాల్గొన్నారు.


మా భూమిని కబ్జా చేశారు : నా భర్త కానిస్టేబుల్‌గా విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. సబ్బవరం మండలం అమృతపురంలో 2004లో 200 గజాల స్థలాన్ని మేము కొనుక్కున్నాం. మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. దీన్ని వైకాపా నాయకుడు కబ్జా చేసి ఫెన్సింగ్‌ వేశాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. పోలీసుల భూమికే రక్షణ లేకుండా పోవడం చాలా బాధగా ఉంది.  

గునపట్ల రామలక్ష్మి, అమృతపురం, సబ్బవరం మండలం


దౌర్జన్యం చేసి గాయపరిచారు : ఇంట్లో ఉన్న సమయంలో భూ తగాదా పేరుతో రాళ్లతో మాపై దాడి చేసిన ఆర్మీ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలి. మాకు ఉన్న 8 సెంట్ల భూమికి పక్కగా 40 సెంట్ల భూమిని ఆర్మీ ఉద్యోగి కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. మా స్థలంలో మేము ఫెన్సింగ్‌ వేసుకున్నాం. దీన్ని తొలగించి మాపై దౌర్జన్యం చేసి రాళ్లతో కొట్టాడు. మా చెల్లిపైన దాడి చేశాడు. మే 30న దాడి చేస్తే రావికమతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మాకు న్యాయం చేయాలి.

పతివాడ లావణ్య, మేడివాడ, రావికమతం మండలం


కన్న కూతురిని కడతేర్చాడు : మా కూతురు రాజ్యలక్ష్మిని నక్కపల్లి మండలం చీడికకు చెందిన నాగేంద్రవర్మకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశాం. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మే 11న మా కుమార్తెను అల్లుడు హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. కూలి పని చేసుకుని జీవిస్తూ ఇద్దరు మనవరాళ్లను నా దగ్గరే ఉంచుకుని పోషించుకుంటున్నాను. అల్లుడిని బయటకు తెచ్చేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. అతడికి కఠిన శిక్షపడేలా చూడాలి.

అప్పలరాజు, కొండ తిమ్మాపురం, ఏలేశ్వరం మండలం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని