logo

సంక్లిష్ట మార్గాల్లో.. సురక్షితమేనా..!

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ సమీపంలో బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదం రైల్వే చరిత్రలోనే పెద్ద విషాదంగా నిలిచింది. ఈ దుర్ఘటనలో 275 మంది మృతిచెందగా వేయి మందికిపైగా క్షతగాత్రులయ్యారు.

Published : 06 Jun 2023 05:31 IST

విశాఖ పరిధిలో రైల్వే లైన్ల తీరిది..
భయాందోళన కలిగిస్తున్న గత సంఘటనలు
ఈనాడు, విశాఖపట్నం

పెందుర్తి వద్ద జరిగిన ప్రమాద దృశ్యం

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ సమీపంలో బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదం రైల్వే చరిత్రలోనే పెద్ద విషాదంగా నిలిచింది. ఈ దుర్ఘటనలో 275 మంది మృతిచెందగా వేయి మందికిపైగా క్షతగాత్రులయ్యారు. మరెంతో మంది చిన్నపాటి గాయాలతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆధునిక పరిజ్ఞానం, అత్యాధునిక సిగ్నలింగ్‌ సాంకేతిక వ్యవస్థలున్నప్పటికీ ఈ ఘటన రైల్వే వర్గాల్లో కలకలం రేపింది.

వందల మందితో ప్రయాణించే రైళ్ల నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తుచేసింది. విశాఖ వంటి కఠినతర రైల్వే లైన్లు కలిగిన చోట ఇది కత్తిమీద సామే. ఒక వైపు సముద్రం మరో వైపు చుట్టూ కొండల మధ్య మార్గాలు ఉన్నాయి. విభిన్న భౌగోళిక పరిస్థితి కలిగిన స్టేషన్‌ దేశంలో ఏదైనా ఉందంటే అది విశాఖ మాత్రమే. గతంలో విశాఖ జిల్లా పరిధిలోని పలు చోట్ల జరిగిన ప్రమాదాలు గుణపాఠాలుగా నిలిచాయి. ఒడిశాలో జరిగిన తాజా ఘటన ద్వారా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

లైను ప్రమాదకరం

విశాఖ జిల్లాలో తాడి వద్ద వాల్తేరు డివిజన్‌ ప్రారంభమయ్యే చోట నుంచి దువ్వాడ ముందు కొండల నడుమ మలుపు తీసుకునే వరకు లైను ప్రమాదకరంగా ఉంటుంది. గతంలో ఇక్కడే ఒకసారి రైలు ప్రమాదం జరిగి 12 మంది మృతి చెందారు. అలాగే పెందుర్తి, గోపాలపట్నం, మేహాద్రిగెడ్డ సమీప ట్రాక్‌, మర్రిపాలెం వద్ద జాగరూకత అవసరం. విశాఖ ప్రధాన రైల్వేస్టేషన్‌ది విచిత్ర పరిస్థితి. ఏ స్టేషన్‌లోనైనా రైళ్లు వచ్చి మళ్లీ అలాగే ముందుకు సంబంధిత రూట్లలో వెళ్లిపోతాయి. ఇక్కడ మాత్రం మళ్లీ వెనక్కి రివర్షన్‌ తీసుకొని వెళ్తాయి. ఈ స్టేషన్‌కు రోజూ 120 వరకు ప్రయాణికుల రైళ్లు వస్తుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాటికి వెంటవెంటనే లైన్లను విడుదల చేయాలి. ప్లాట్‌ఫారాలు రద్దీగా ఉన్నప్పుడు విశాఖ బయట కొన్ని రైళ్లను నిలిపేయాల్సి వస్తుంది. లూప్‌ లైన్ల వద్ద గూడ్సులను ఆపుతారు. సూపర్‌ఫాస్ట్‌, దురంతో, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ముందుగా పంపేందుకు వీలుగా ఇలా చేస్తారు. ఈ సందర్భాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.


2007 జూన్‌ 12

నాగర్‌కోయిల్‌ నుంచి హావ్‌డా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ దువ్వాడ వద్ద ప్రమాదానికి గురైంది. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆ ఘటన చోటుచేసుకుంది. ఆ రైలు దువ్వాడ స్టేషన్‌ సమీపంలోకి వచ్చేసరికి కొండల మధ్య మలుపుతిరిగే క్రమంలో వేరే ట్రాక్‌లోకి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. అందులో ముగ్గురు మృతిచెందగా 24 మందికి గాయాలయ్యాయి. కొన్ని బోగీలు పట్టాలు తప్పగా అదృష్టవశాత్తూ మృతుల సంఖ్య పెరగలేదు.


2002 నవంబరు 6

గోపాలపట్నం వద్ద పొర్లుపాలెంలోని మేహాద్రిగెడ్డ సమీపంలోని రైల్వే ట్రాకుల వద్ద పెద్ద ప్రమాదమే జరిగింది. రైల్వే ట్రాకుల మీద గ్యాంగ్‌మెన్ల బృందం పనులు చేస్తుంది. ఒకే సమయంలో రెండు వైపుల నుంచి రెండు రైళ్లు రావడంతో ఒక ట్రాక్‌ మీదున్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పనిచేస్తున్న సమయంలో రెడ్‌ సిగ్నల్‌ వేయలేదు. కనీసం పనులు జరుగుతున్నట్లు సూచికలు ఏర్పాటు చేయకపోగా కనీసం ఎర్ర జెండానైనా ఉంచలేదు. ఆ ప్రమాదం నుంచి పదుల మంది అనూహ్యంగా తప్పించుకొని బతికి బయటపడ్డారు.


2023 ఏప్రిల్‌ 3

పెందుర్తి రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఆ రోజు గంగవరం పోర్టు నుంచి బిలాస్‌పూర్‌ స్టీలుప్లాంటుకు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు ఉత్తర సింహాచలం ట్రాక్‌ నుంచి కొత్తవలస వైపు వెళ్తుండగా పెందుర్తి యార్డ్‌ వద్ద హఠాత్తుగా పట్టాలు తప్పింది. ట్రాక్‌ మారినపుడు ఇది జరిగినట్లు సమాచారం. ఆ ఘటనలో అయిదు బోగీలు ఏకంగా రైలు పట్టాల నుంచి పక్కకు ఒరిగాయి. పెందుర్తి వద్ద ఎనిమిదో నెంబర్‌ రూట్లో ఇది జరగ్గా వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలును ఆపేయడం.. అదే సమయంలో మరే రైలు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ సంఘటనలో ఆస్తి నష్టం తప్ప ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.


తరచూ పట్టాలు తప్పుతున్నాయ్‌

విశాఖ వాల్తేరు డివిజన్‌లో కొత్తవలస-కిరండూల్‌ మార్గం అత్యంత ప్రమాదకరమైంది. భౌగోళికంగా అత్యంత ప్రమాదానుకూల ప్రదేశంలో లైన్లు ఉండడంతో ఏటా అనేక సార్లు రైళ్లు పట్టాలు తప్పుతాయి. ముఖ్యంగా గూడ్సు రైళ్లే ఈ మార్గంలో ప్రభావానికి గురవుతున్నాయి. వర్షాల సమయంలో కొండల మీద నుంచి రాళ్లు పడడం, లోయలు దాటాక మలుపు తీసుకునే క్రమంలో పట్టాలు తప్పుతున్నాయి. ఈ మార్గంలో చాలాచోట్ల రైళ్లు చాలా తక్కువ వేగంతోనే ప్రయాణిస్తుంటాయి. ప్రమాదాలపుడు భారీగా ఆస్తి నష్టం కలుగుతుంది. రెండేళ్ల కిందట అంతకుముందు జరిగిన ఘటనల్లో కొందరు మృతిచెందారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని