logo

వాహనమే లేదు..విజిలెన్స్‌ ఎట్టా?

గనుల శాఖలో విజిలెన్స్‌ విభాగం చాలా కీలకమైంది. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలన్నా.. సహజ వనరుల దోపిడీని నిలువరించాలన్నా విజిలెన్స్‌ అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది.

Updated : 07 Jun 2023 04:42 IST

గనులశాఖలో కొలిక్కిరాని కార్యాలయాల విభజన
జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా

ఆనందపురం మండలంలో ఇటీవల అక్రమ తవ్వకాలు జరిగిన ఏపీఐఐసీ భూములు

ఈనాడు, పాడేరు : గనుల శాఖలో విజిలెన్స్‌ విభాగం చాలా కీలకమైంది. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలన్నా.. సహజ వనరుల దోపిడీని నిలువరించాలన్నా విజిలెన్స్‌ అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. నిత్యం క్షేత్రస్థాయిలో ఉండి నిరంతరం తనిఖీలు చేయాల్సిన విభాగం అధికారులు బయట అడుగు పెట్టడానికి ముందు వాహనం కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.

ఎస్‌.రాయవరం మండలం గుడివాడలో గుట్టుగా సాగిస్తున్న గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

నెల రోజుల క్రితం గనుల శాఖను కొత్త జిల్లాలవారీగా విభజించారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లా మొత్తంగా విజిలెన్స్‌ అధికారిని నియమించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ విజిలెన్స్‌ కార్యాలయానికి వాహన సదుపాయం మాత్రం కల్పించలేదు. దీంతో గస్తీ తిరగాలన్నా.. ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నా వాహనం లేక ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలోని జిల్లా మైనింగ్‌ కార్యాలయ వాహనాన్నే రెండు విభాగాల అధికారులూ వినియోగించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల సకాలంలో అక్రమ మైనింగ్‌పై దాడులు చేయలేని పరిస్థితి నెలకొంది.

ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ అండతో స్థానిక నేతలే ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వేస్తూ తరలించేస్తున్నారు. వారం వారం స్పందనలోనూ వీటిపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. తరుచూ దాడులు చేసి భారీగా జరిమానాలు విధించినప్పుడే అక్రమ మైనింగ్‌కు కొంతయినా అడ్డుకట్ట పడుతుంది. అలా దాడులు చేయాలంటే అధికారులు క్షేత్రస్థాయికి సకాలంలో చేరుకుంటేనే సాధ్యమవుతుంది. మరి వాహనమే లేకుంటే అధికారులు ఎలా వెళతారు.. అక్రమ తవ్వకాలను ఎలా అడ్డుకుంటారో సంబంధిత ఉన్నతాధికారులకే తెలియాలి. వారం రోజుల క్రితం ఆనందపురం మండలంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై స్థానికులు గనుల శాఖకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ విభాగానికి వాహనం లేకపోవడంతో జిల్లా మైనింగ్‌ అధికారి వాహనాన్ని అడిగి తీసుకుని వెళ్లారు. అప్పటికే అక్కడ తవ్విన గ్రావెల్‌ అంతటిని అక్రమార్కులు మాయం చేయగా తవ్విన పరిమాణాన్ని అంచనా వేసి జరిమానా విధించి వచ్చేశారు. వారు వెళ్లిన తర్వాత మళ్లీ తవ్వకాలకు అక్రమార్కులు బరితెగించడం విశేషం.

వాహనాన్ని పంచుకోవడమే కాదు.. విజిలెన్స్‌ విభాగానికి ప్రత్యేకంగా కార్యాలయం కూడా లేదు. జిల్లా మైనింగ్‌ అధికారి కార్యాలయంలోనే వీరు కొంత స్థలంలో సర్దుకొని విధులు నిర్వహిస్తున్నారు.


మూడు జిల్లాల పర్యవేక్షణ బాధ్యత

విజిలెన్స్‌ బృందం నిత్యం క్షేత్రస్థాయిలోనే ఉండాలి. ఏ మార్గంలో అక్రమ మైనింగ్‌ రవాణా జరుగుతుందో సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గస్తీ కాసి వాహన తనిఖీలు చేపట్టాలి. అనుమతులు లేకుండా తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేయడం.. స్థానిక పోలీసు స్టేషన్‌కు అప్పగించడం.. భారీగా అపరాధ రుసుములు విధించడం చేయాలి. ప్రతినెలా సుమారు రూ. 10 లక్షల వరకు జరిమానా రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి. అదే సమయంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలపై దాడులు చేయాలి. క్వారీలు, క్రషర్లలోనూ తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. పైగా విజిలెన్స్‌ బృందం ఒక్క జిల్లాకే పరిమితం కాదు.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో తిరగాల్సి ఉంటుంది. వీరి విభాగం ఏర్పాటై నెల రోజులైనా కార్యాలయం, వాహనం లేకపోవడంతో తనిఖీలు విశాఖ జిల్లాకే పరిమితమవుతున్నాయి. అనకాపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది.


సమన్వయం చేసుకుంటున్నాం..:

వాహనం కోసం ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టామని ఈనెలలో అందుబాటులోకి వస్తుంది. వాహనం లేకపోయినంత మాత్రాన విధులకు ఇబ్బంది ఏమీ లేదు. ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం, తనిఖీలు చేపట్టి జరిమానాలు విధిస్తున్నాం. కొత్త కార్యాలయం కాబట్టి అన్ని సౌకర్యాలు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆలోగా జిల్లా మైనింగ్‌ అధికారితో సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నాం.

డి.ఇ.వి.ఎస్‌.ఎన్‌.రాజు, గనులశాఖ విజిలెన్స్‌ అధికార


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని