logo

పరిశ్రమల్లో భద్రత ప్రమాణాల తనిఖీలు

పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై భద్రత ప్రమాణాల తనిఖీ (సేఫ్టీ ఆడిట్‌) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రవి వెల్లడించారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) గ్రీన్‌జోన్‌ పరిధిలో ఏపీఐఐసీ, అటవీశాఖ ఆధ్వర్యంలో 5 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్‌ మంగళవారం ప్రారంభించారు.

Published : 07 Jun 2023 05:16 IST

కలెక్టర్‌ రవికి మొక్కలను బహూకరిస్తున్న జడ్‌ఎం త్రినాథరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై భద్రత ప్రమాణాల తనిఖీ (సేఫ్టీ ఆడిట్‌) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రవి వెల్లడించారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) గ్రీన్‌జోన్‌ పరిధిలో ఏపీఐఐసీ, అటవీశాఖ ఆధ్వర్యంలో 5 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ పరిశ్రమలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, కార్మికశాఖ, అగ్నిమాపకశాఖల ఆధ్వర్యంలో నిపుణులు జిల్లాలో ఇప్పటివరకు 150 పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ పూర్తి చేశారన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఈ తనిఖీలు ఉపయోగ పడతాయన్నారు. కంపెనీల్లో భద్రతాపరంగా ఉన్న లోపాలు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల కమిటీ కంపెనీలకు సిఫార్స్‌ చేయడంతోపాటు వాటిని అమలు చేసేలా కార్యాచరణతో పనిచేస్తుందన్నారు. పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతోపాటు కార్మికుల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. భద్రతాపరమైన లోపాలు గుర్తించిన కంపెనీలకు ఇప్పటికే నోటీసులు అందించామన్నారు. కంపెనీల భద్రతపై సలహాలు, ఫిర్యాదులు నిరంతరం స్వీకరిస్తామన్నారు.

హరిత అనకాపల్లి సాధనకు కలిసిరండి

హరిత అనకాపల్లి జిల్లా సాధనకు అందరూ కలిసిరావాలని కలెక్టర్‌ రవి పిలుపునిచ్చారు. జిల్లాలో జులై నెలాఖరు నాటికి 10 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనిలో అందరూ భాగస్వాములై ఒక్కో మొక్కను నాటాలని కోరారు. భవిష్యత్తు తరాలకు ఆస్తులతోపాటు మంచి వాతావరణ ఇవ్వాలనేది సంకల్పమన్నారు. ప్రతి పరిశ్రమ వ్యక్తిగత లక్ష్యాలను పెట్టుకొని 2 వేల మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వశాఖలకు లక్ష్యాలను నిర్దేశించి మొక్కలు నాటిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుతామని ఏపీఐఐసీ అధికారులు, కలెక్టర్‌, వివిధ కంపెనీల ప్రతినిధులతో అటవీశాఖ డీఎఫ్‌ఓ లక్ష్మణ్‌ ప్రతిజ్ఞ చేయించారు. యొకహోమా టైర్ల తయారీ పరిశ్రమ ప్లాంట్‌ హెడ్‌ ప్రహ్లాదరెడ్డి, రామరాజు, ఐఓసీ కంపెనీ హెడ్‌ ప్రసాద్‌, ఏపీఐఐసీ జడ్‌ఎం త్రినాథరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాసరావు, పరిశ్రమలశాఖ జీఎం శ్రీధర్‌, ఎఫ్‌ఆర్‌ఓ లావణ్య, ఏఈ శ్రీనివాసరావు, సీఈటీపీ ప్లాంట్‌ పర్యావరణ ఇంజినీర్‌ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని