logo

దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయ్‌..!

వాల్తేరు డివిజన్‌లో విశాఖ రైల్వేస్టేషన్‌ పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. 8 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.. కాని స్టేషన్‌కు ఉన్న ప్రతిబంధకం కారణంగా ఇక్కడికొచ్చిన ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్లాలి.

Updated : 08 Jun 2023 03:06 IST

విశాఖ స్టేషన్‌కు రాని 10 రైళ్లు
ప్లాట్‌ఫామ్‌లపై రద్దీయే కారణం
విశాఖపట్నం, న్యూస్‌టుడే

ఉత్తర సింహాచలం రైల్వేస్టేషన్‌

వాల్తేరు డివిజన్‌లో విశాఖ రైల్వేస్టేషన్‌ పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. 8 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.. కాని స్టేషన్‌కు ఉన్న ప్రతిబంధకం కారణంగా ఇక్కడికొచ్చిన ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్లాలి. దీని కోసం ఇంజిన్‌ మార్చాల్సి రావడంతో 20నిమిషాల వరకు ప్లాట్‌ఫామ్‌పై ఉండాల్సిన పరిస్థితి. ఫలితంగా మరిన్ని రైళ్లు విశాఖ స్టేషన్‌కు వచ్చే అవకాశం లేకుండా పోతోంది.

విశాఖ స్టేషన్‌లోని ఒక్కో ప్లాట్‌ఫామ్‌ పైన సరాసరి రోజుకు 4గంటల చొప్పున రైళ్లు నిలిచి ఉంటున్నాయని అంచనా.. సాధారణంగా విజయవాడ తదితర పెద్ద స్టేషన్లలో రైళ్లు 5 నుంచి 10 నిమిషాలు ఆగుతాయి. ఈ లెక్కన తీసుకుంటే విశాఖ స్టేషన్‌లో రెట్టింపు సమయం వృథా అవుతోంది. ఈ కారణంగానే పలు రైళ్లను దువ్వాడ మీదుగా నడపాల్సి వస్తోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉత్తర సింహాచలం స్టేషన్‌ మీదుగానే 10 రైళ్లు దువ్వాడ వెళుతున్నాయి. విశాఖ స్టేషన్‌ నుంచి ఇక్కడికి 11కి.మీ. దూరం కాగా, దువ్వాడ 23కి.మీ. దూరం ఉంటుంది. ఈ దృష్ట్యా నగరవాసులకు ఉత్తర సింహాచలం స్టేషన్‌ కొంత సౌకర్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. రాత్రుళ్లు స్టేషన్‌లోకి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. విశాఖ స్టేషన్‌లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా 10 రైళ్లను ఇక్కడ నిలిపితే నగర ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుందని డీఆర్‌యూసీసీ(డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ) కోరుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలని కోరుతోంది. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ వాణిజ్య పరంగా ఈ స్టేషన్‌కు వెసులుబాటు లేని కారణంగా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అందుకే ప్రతిపాదన చేయలేదన్నారు. కార్యకలాపాల సౌలభ్యం కోసం కొన్ని రైళ్లకు హాల్ట్‌ కల్పిస్తున్నట్లు చెప్పారు.

చెట్ల కొమ్మలు పడి నిలిచిన పలు రైళ్లు

దువ్వాడ కాపు జగ్గరాజుపేట గేటు సమీపంలో రైల్వే విద్యుత్‌ తీగలపై పలుచోట్ల చెట్లు కొమ్మలు పడటంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం వీచిన భారీ గాలులకు దువ్వాడ-రాజమహేంద్రవరం ప్రధాన మార్గంతో పాటు దువ్వాడ స్టీల్‌ప్లాంట్లకు వెళ్లే రైలు మార్గంలో కొమ్మలు పడినట్లు గుర్తించిన సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో విశాఖ నుంచి బయలుదేరి వెళ్లాల్సిన విశాఖ-సికింద్రాబాద్‌ గరీబ్‌రథ్‌, భువనేశ్వర్‌-ఎస్‌ఎంవీటీ బెంగళూరు - హంసఫర్‌, విశాఖ- నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లు గోపాలపట్నం, మర్రిపాలెం స్టేషన్‌ సమీపంలో నిలిపివేశారు. ముందుగా ప్రధాన మార్గంలో విద్యుత్‌ తీగలను సరి చేయడంతో ఒక్కొక్కటిగా బయలుదేరి వెళ్లాయి.

ఏయే రైళ్లు వెళుతున్నాయంటే..

* టాటా-ఈఆర్‌ఎస్‌ రైలు(ఆదివారం రాత్రి 8.45 గంటలకు)

* ఎస్‌బీపీ-సీబీఈ (ప్రత్యేక రైలు) (బుధవారం రాత్రి 8.45 )

* హావ్‌డా-ఎస్‌ఎస్‌పీఎన్‌ (గురువారం తెల్లవారుజామున 4.45)

* బీబీఎస్‌-తిరుపతి (శనివారం రాత్రి 7.37)

* తిరుపతి-బీబీఎస్‌ (సోమవారం ఉదయం 9.30గంటలకు)

* ఈఆర్‌ఎస్‌-టాటా (సోమవారం మధ్యాహ్నం 12.08)

* సీబీఈ-బీజేయూ (బుధవారం రాత్రి 10.40)

* ఈఆర్‌ఎస్‌-టాటా (గురువారం మధ్యాహ్నం 12.08)

* ఎస్‌ఎస్‌పీఎన్‌-హావ్‌డా(శుక్రవారం రాత్రి 11గంటలకు)

* సీబీఈ-ఎస్‌బీపీ (శనివారం మధ్యాహ్నం 12.08)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని