logo

ముడిసరకే భారం.. మూసివేతే మార్గం

ఫెర్రో రంగాన్ని వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. 2022 జులై నుంచి విద్యుత్తు ఛార్జీల వల్లే నష్టం వస్తుందని లబోదిబోమంటున్నా విసుగుచెందిన పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated : 08 Jun 2023 06:17 IST

ఫెర్రో పరిశ్రమల యాజమాన్యాలు గగ్గోలు
అచ్యుతాపురం, న్యూస్‌టుడే

ఫెర్రో రంగాన్ని వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. 2022 జులై నుంచి విద్యుత్తు ఛార్జీల వల్లే నష్టం వస్తుందని లబోదిబోమంటున్నా విసుగుచెందిన పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒడిశాలో టాటా సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పార్కులో ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని సన్నాహాలు ఆరంభించాయి. ఇదే జరిగితే ఏపీలో 3.50 లక్షల మంది రోడ్డున పడే ప్రమాదం ఉంది.

అచ్యుతాపురం సెజ్‌లో అభిజీత్‌ ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీ, మైథాన్‌, ఆల్‌బస్‌, సుందరం పరిశ్రమలు విస్తరించాయి.

2002-12 వరకు కేవలం ఏడు పరిశ్రమలే ఉన్న ఏపీలో తెదేపా ప్రభుత్వ కృషి కారణంగా 2018 నాటికి రూ. 15 వేల కోట్లతో 38 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. విద్యుత్తే ముడిసరకుగా నడిచే ఫెర్రో పరిశ్రమలకు తెదేపా ప్రభుత్వం సింగిల్‌ టారిఫ్‌ కింద య´నిట్‌ ధర రూ. 4.95 అందించి ప్రోత్సహించింది. దీంతోపాటు పరిశ్రమలకు 2016-17కి రూ.1.50, 2017-18లో 0.75 పైసలు రాయితీ అందించి నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఈరంగాన్ని కాపాడింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా 50 వేల మంది అనుబంధ రంగాల ద్వారా 3 లక్షల మందికి ఉపాధిని అందించే ఫెర్రో పరిశ్రమను రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది.  రాయితీలు ఇవ్వకపోయినా, అంతర్జాతీయంగా నిర్మాణరంగం కుదేలుకావడం, స్టీల్‌కు డిమాండ్‌ తగ్గిపోవడంతో ధరలు భారీగా పతనమైనా మంచి రోజులు రాకపోతాయా? అని టన్ను రూ. 12 వేల వరకు నష్టం వచ్చినా ఇప్పటివరకు నెట్టుకొచ్చాయి.

ప్రపంచానికి ఎగుమతి అవుతున్న ఫెర్రో ఉత్పత్తుల్లో ఏపీ పరిశ్రమల వాటా 60 శాతం ఉండగా మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 40 శాతం చేస్తున్నాయి. ఈ పరిశ్రమపై వైకాపా ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల రూపంలో బాదింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఉన్న సింగిల్‌ టారిఫ్‌ను డబల్‌ టారిఫ్‌గా మార్చిన జగన్‌ సర్కార్‌ డ్యూటీ పేరుతో రూ. 0.6 పైసలు, రూ. 0.94 పైసలు, ట్రూ ఆఫ్‌ ఛార్జీలు పేరుతో రూ. 0.7 పైసలు ఐదేళ్లు వసూళ్లు చేశారు. వీటితో పాటు ఎనర్జీ కింద రూ.0.52పైసలు, రూ.0.40పైసలు ఫ్యూయల్‌ ఛార్జీలు ఇలా అన్ని రకాలైన బాదుడు కలిపి యూనిట్‌కి రూ. 3.89 విధించారు. ప్రభుత్వం విధించిన అదనపు బాదుడుకు కొనుగోలు ఛార్జీ రూ.4.95 కలిపి ఒక్కో యూనిట్‌ ధర మరెక్కడాలేని విధంగా ఏపీలో రూ.8.84 పడుతోంది.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌ ధర రూ. నాలుగున్నరే ఉంది. ఒడిశాలో యూనిట్‌ రూ.5.20 ధర ఉండగా కొత్తగా వచ్చే పరిశ్రమలకు రూ.1.50 రాయితీ అందిస్తామని పరిశ్రమలను ఆహ్వానిస్తోంది.

కొలిమి ఆపితే మళ్లీ 48 గంటలకే!

సెజ్‌లోని మిగిలిన పరిశ్రమలు అత్యవసర సమయంలో జనరేటర్లు ఉపయోగించి ఉత్పత్తులు కొనసాగించే అవకాశం ఉన్నా ఫెర్రో కంపెనీలు మాత్రం ఉత్పత్తిని కొనసాగించే అవకాశం లేదు. పరిశ్రమలో కొలిమి ఒక్కసారి నిలుపుదల చేస్తే మళ్లీ అది ప్రారంభం కావడానికి 48 గంటలకుపైగా సమయం పడుతోంది. భారీస్థాయిలో విద్యుత్తు వినియోగం ఈ కంపెనీల మూలంగా అవుతోంది. విద్యుత్తే వీటికి ముడిసరకు కావడంతో ప్రభుత్వాలు ఫెర్రో కంపెనీలకు రాయితీపై విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి. తెదేపా ప్రభుత్వం కంటే జగన్‌ ప్రభుత్వం ఏకంగా యూనిట్‌ ధరను రూ.4.25 నుంచి రూ.8.84 పెంచడం వల్ల ఈ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పరిశ్రమలు మూసివేయాలని నిర్ణయం వెనుక విద్యుత్తు ఛార్జీలే ప్రధాన కారణమని ఫెర్రో కంపెనీల యాజమానులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని