logo

మరో భారీ భూసమీకరణ!

విశాఖలో మరో భారీ భూసమీకరణకు పభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తయింది. ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ గ్రామీణ మండలాల పరిధిలో 771 ఎకరాల సమీకరణకు ప్రకటన జారీ అయింది.

Published : 08 Jun 2023 03:27 IST

నాలుగు మండలాల్లో 771 ఎకరాలకు ప్రణాళిక

శొంఠ్యాంలో గుర్తించిన భూములు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో మరో భారీ భూసమీకరణకు పభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తయింది. ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ గ్రామీణ మండలాల పరిధిలో 771 ఎకరాల సమీకరణకు ప్రకటన జారీ అయింది. ఏ గ్రామాల నుంచి ఎన్ని ఎకరాలు తీసుకోవాలనేది గుర్తించారు. ఈ నెల 12 నుంచి 18 వరకు పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకుంటారు. అభ్యంతరాలుంటే  వచ్చే నెల 4లోగా తహసీల్దార్‌ కార్యాలయాల్లోని భూసంరక్షణ విభాగ ఉప తహసీల్దార్‌కు తెలపొచ్చు.

వీఎంఆర్‌డీఏకు అప్పగించేలా: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకానికి  ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో 2020లో దాదాపు ఆరు వేల ఎకరాల వరకు భూసమీకరణ చేపట్టారు. పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇచ్చేలా ప్రణాళిక చేశారు. ఇప్పుడూ అదేరకంగా చేయనున్నారు. గతంలో  ఒక సెంటు స్థలాలు అభివృద్ధి చేసినందుకు.. ప్రతిఫలంగా విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)కు దాదాపు 500 ఎకరాల వరకూ ఇవ్వనున్నారు. కొంత రైతులకు పరిహారంగా, మరికొంత ఇళ్ల లబ్ధిదారులకు కేటాయిస్తారు.

ఆనందపురం : ఈ మండలంలో అత్యధికంగా 400 ఎకరాలు రైతుల నుంచి సమీకరించనున్నారు. ముకుందపురంలో 72 ఎకరాలు, శొంఠ్యాం 239, కుసులువాడ 66.64, బాకురుపాలెం 20.67, జగన్నాధపురం 3 ఎకరాలు తీసుకోనున్నారు. భూమీకరణ ప్రత్యేక ఉపకలెక్టర్‌ ఈ నెల 6న ప్రకటన జారీ చేశారు. ముకుందాపురంలో పోరంబోకు కొండలో 72 ఎకరాలు, శొంఠ్యాంలో 220 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. భూపరిరక్షణ విభాగం ప్రత్యేక కలెక్టరు దీన్ని పర్యవేక్షిస్తున్నారు.
పద్మనాభం : ఇక్కడ నరసాపురం, తునివలసలో 116.42 ఎకరాలు సమీకరిస్తున్నారు. నరసాపురంలోని సర్వే నంబరు 59, 70, 72, 75, 90లో 86.49 ఎకరాలు గయాలు, తునివలసలో సర్వే నంబరు 22, 23, 24, 25, 26లో 29.93 ఎకరాలు గుర్తించారు. జాతీయ రహదారుల సంస్థ ప్రత్యేక ఉపకలెక్టర్‌ దీనికి సమీకరణ అధికారిగా ఉన్నారు.

భీమిలి : దాకమర్రిలో 12 ఎకరాలు, నిడిగట్టు 6.33, కాపులుప్పాడ 5 , ఆర్‌వై అగ్రహారం 47.07, నేరెళ్లవలస 31.55, తాళ్లవలస 16.66, చిప్పాడలో 16.61 ఎకరాలు సమీకరించేందుకు గుర్తించారు.  నేరెళ్లవలస వద్ద సమీకరిస్తున్న స్థలం చాలా వరకు ఇసుకమేటలతో ఉన్నదే. రెవెన్యూ రికార్డుల్లోనూ అలానే ఉంది. సమీకరణాధికారిగా డీఆర్‌డీఏ పీడీని నియమించారు.

విశాఖ గ్రామీణ మండలం: జీవీఎంసీ పరిధి కొమ్మాది ఆరో వార్డులో 78.92 ఎకరాలు, పరదేశిపాలెంలో 17.48 ఎకరాలు సమీకరిస్తున్నారు. ఈ రెండు చోట్ల ప్రభుత్వ భూములనే సమీకరించనున్నారు. విశాఖ ఆర్డీవోను భూసమీకరణ అధికారిగా నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని