logo

ప్రభుత్వ జాగా.. అక్రమార్కుల పాగా...

రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. నేటికీ ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టి సంరక్షించడంలో ఉన్నతాధికారులు చొరవ చూపటం లేదు.

Published : 09 Jun 2023 05:45 IST

సంరక్షణ మరచిన యంత్రాంగం

మారికవలసలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయని ప్రభుత్వ స్థలం

న్యూస్‌టుడే, కొమ్మాది : రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. నేటికీ ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టి సంరక్షించడంలో ఉన్నతాధికారులు చొరవ చూపటం లేదు. దీంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.

* అత్యంత విలువైన భూములను కొందరు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తుండడంతో.. రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలనే సూచనలూ అధికారులు పట్టించుకోవడం లేదు. రక్షణకు కంచె ఏర్పాటుకు నిధులు లేవనే కారణాలు చెబుతున్నారు.కనీసం ఇనుప హెచ్చరిక బోర్డులనైనా ఆక్రమిత స్థలాల్లో ఏర్పాటు చేస్తే కొంతైనా రక్షణ ఉంటుంది. గట్టిగా గాలివీస్తే ఎగిరిపోయే ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ఫలితం ఏముంటుందో వారికే తెలియాలి.

* మధురవాడ పైవంతెనకు కూతవేటు దూరంలో ఎంఎస్‌ఆర్‌ లే-అవుట్‌కు ఆనుకుని ఉన్న వాగు స్థలాన్ని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ కాలనీలో మురుగు నిలిచి జనం ఇబ్బందులు పడుతున్న స్థితిపై ‘ఈనాడు’లో కథనాలు ప్రచురించడంతో జీవీఎంసీ అధికారులు స్పందించారు. రూ.16లక్షలతో ఆ ప్రభుత్వ స్థలం మీదుగా కాలువ నిర్మాణం చేపట్టారు. మిగతా స్థలంలో ఫ్లెక్సీతో బోర్డు ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే ఆ బోర్డు మాయమైంది. విలువైన స్థలం అన్యాక్రాంతం కాకుండా రేవళ్లపాలెంలో అద్దె భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సచివాలయానికి ఈ స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందనే సూచనలు కూడా వస్తున్నాయి. - మారికవలస కూడలిలో జాతీయరహదారికి ఆనుకుని రూ.కోట్ల విలువైన 300 గజాల భూమిపై కొందరు కన్నేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు సిద్ధపడుతున్నా.. రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏర్పాటుకు హెచ్చరిక బోర్డులు లేవనే సమాధానం వస్తుందని పలువురు చెబుతున్నారు.

* గత ఏడాది జనవరిలో అప్పటి తహసీల్దార్‌ రామారావు కొన్ని ఇనుప హెచ్చరిక బోర్డులను తయారుచేయించి మధురవాడ, పీఎంపాలెం, పరదేశిపాలెం, మారికవలస, కొమ్మాది తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుచేయించారు. ఆ బోర్డుల్లో కొన్ని మాయమవగా... కొన్ని ఇప్పటికీ భూములకు రక్షణగా నిలిచాయి.

ఇటీవల హెచ్చరిక బోర్డు తొలగించిన ప్రాంతం

* రేవళ్లపాలెం రహదారిలో పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా సర్వే సంఖ్య 196లోని ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డును కొందరు తొలగించేశారు. ఆక్రమించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నా... ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం. రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు