విలవిల్లాడిన కన్నపేగు
భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఒంటరిగా ఇల్లు విడిచి వచ్చిన గర్భిణి అనుకోని కష్టంలో పడింది.
విశాఖ రైల్వే స్టేషన్‌లో 18 నెలల చిన్నారి కిడ్నాప్
తల్లితో నిద్రించిన సమయంలో ఘటన
ఒడిశా జంటపై అనుమానం
భర్త వేధింపులతో ఇల్లు వదిలొచ్చిన మహిళకు అనుకోని కష్టాలు
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, రైల్వేస్టేషన్: భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఒంటరిగా ఇల్లు విడిచి వచ్చిన గర్భిణి అనుకోని కష్టంలో పడింది. 18 నెలల కుమారుడు విశాఖ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌నకు గురవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటన జరిగినా సాయంత్రం వరకూ పోలీసులు నిందితుల ఆచూకీ గుర్తించలేకపోయారు. తల్లడిల్లిన ఆ తల్లి ‘నా బిడ్డ కనిపించాడా...ఎక్కడున్నాడు’...అంటూ పదే పదే రైల్వే స్టేషన్‌లో సిబ్బందిని అడుగుతూ పడిన వేదన అంతా ఇంతా కాదు. కుమారుని ముద్దు ముద్దు మాటలు గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. ఈ కిడ్పాప్ ఉదంతంపై విశాఖ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలివి.
కొంగరి భవానీది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయపల్లి. ఈమె భర్త లారీ డ్రైవర్. కుటుంబ కలహాలు, భర్త వేధింపుల నేపథ్యంలో కుమారుడు విజయ్‌కుమార్(18 నెలలు)ను ఏమైనా చేస్తారేమోనని భయపడింది. పుట్టింటి వారూ పట్టించుకోకపోవడంతో ఇల్లు విడిచి దూరంగా వెళ్లిపోవాలని భావించి బిడ్డతో సహా రైలెక్కింది. బుధవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. 8వ నంబర్ ప్లాట్ ఫామ్‌పై రాత్రంతా ఉండిపోయింది. గురువారం తెల్లవారుజామున ఒడిశాకు చెందిన ఒక జంట పరిచయం చేసుకొని మాటలు కలిపి అక్కడే ఉన్నారు. తరువాత తన పక్కనే బిడ్డను పడుకోపెట్టుకున్న భవానీ మెల్లగా నిద్రలోకి జారుకుంది. రాత్రంతా నిద్రలేకపోవడంతో గాఢనిద్రలోకి జారుకుంది. కొంత సమయం తరువాత లేచి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. అలాగే తనతో మాట్లాడిన ఒడిశా జంట కనిపించకపోవడంతో ఆమె బోరున విలపించారు. స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసుల్ని ఆశ్రయించింది. హుటాహుటిన తనిఖీలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ సి.ఐ కోటేశ్వరరావు తెలిపారు. భవానీతో మాటలు కలిపిన జంటే బాలుడ్ని కిడ్నాప్ చేసిందా? ఏదైనా ముఠా కిడ్నాప్‌కు పాల్పడి ఉంటుందా? అనే కోణంలో జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవానీ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. అయినా ఆహారం తీసుకోక బిడ్డ కోసం రోదిస్తుండటంతో అక్కడి వారు చలించిపోయారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు.
సీసీ కెమెరాలున్నా.: మారు మూల ప్రాంతాల్లో జరిగిన నేరాలను తక్షణం కనిపెడుతున్న పోలీస్ విభాగం.. సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్న విశాఖ స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌పై ఎటువంటి సమాచారం తక్షణం తెలుసుకోలేకపోయింది. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే సి.సి కెమెరాలు పరిశీలిస్తే కొంతైనా ప్రయోజనం ఉండేదని పలువురు భావిస్తున్నారు. అయితే..సి.సి కెమెరా ఫుటేజ్‌లలో నాణ్యత లేకపోవడం.... సంఘటన జరిగిన ప్రాంతంలో కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తులో ఇబ్బంది తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. విశాఖ నగరంలోని పోలీసు బృందాలకు సమాచారం చేరవేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కిడ్నాప్ ముఠాలపైనా నిఘా ఉంచినట్లు వివరించారు.
* ఇలా అయితే ఎలా: విశాఖ రైల్వే స్టేషన్ విస్తీర్ణం , ప్రయాణికుల సామర్థ్యం ఆధారంగా 200పైగా కెమెరాలు ఇక్కడ అవసరం. ప్రస్తుతం దాదాపు 40 మాత్రమే ఉన్నాయని, అందులో సగం కూడా సక్రమంగా పని చేయడం లేదని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య