logo

రూ.10 కోట్లతోనూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణం

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు గురువారం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి భూమిపూజ చేశారు.

Published : 09 Jun 2023 05:45 IST

శిలాఫలకం ఆవిష్కరించిన స్వరూపానందేంద్ర, మంత్రి అమర్‌

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు గురువారం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి భూమిపూజ చేశారు. ఆలయాన్ని రూ.10 కోట్లతో మళ్లీ నిర్మిస్తారు. తొలివిడతగా రూ.3.5 కోట్లతో చేసే పనులకు శంకుస్థాపన చేశారు. స్వామీజీ ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి  మాట్లాడుతూ ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు, కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఆలయ నిర్మాణం పూర్తైతే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. దేవాలయానికి చెందిన రూ.7 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అమ్మవారి జాతర నెల రోజుల కాలంలో 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. నిత్యం వేలాది మంది వస్తున్నారని చెప్పారు. వైకాపా పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ వేసవి సెలవుల కారణంగా భక్తుల తాకిడి తగ్గలేదని, అందుకే వచ్చేనెల మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భక్తులకు అమ్మవారి దర్శనం ఉంటుందని, నిర్మాణ సమయంలో అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత, ఈఓ బండారు ప్రసాద్‌, ఖోఖో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు దాడి జయవీర్‌, కార్పొరేటర్లు కొణతాల నీలిమ, పీలా లక్ష్మీసౌజన్య, దేవాదాయ శాఖ జిల్లా అధికారి రాజారావు, డీఎస్పీ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని